ఊరికి వెళ్తున్నారా.. జర జాగ్రత్త.! | Police Awareness on LHMS App in YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఊరికి వెళ్తున్నారా.. జర జాగ్రత్త.!

May 3 2019 12:12 PM | Updated on May 3 2019 12:12 PM

Police Awareness on LHMS App in YSR Kadapa - Sakshi

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ పోస్టర్లను విడుదల చేస్తున్న ఎస్పీ అట్టాడ బాబూజీ ౖ(ఫెల్‌ ఫొటో)

ప్రొద్దుటూరు క్రైం : వేసవి మొదలైంది.. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చేశారు. వేసవిలో చాలా మంది వారి వారి బంధువుల ఊళ్లకు వెళ్తారు. ఇంకొందరు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇళ్లకు తాళం వేసి వారం–పది రోజుల పాటు స్వస్థలాలకు రాని పరిస్థితి ఉంటుంది. ఎండలు  మండిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత  తగ్గడం  లేదు. రాత్రిళ్లు చల్లని గాలి కోసం ఆరుబయట నిద్రించేవాళ్లు  చాలా మంది ఉన్నా రు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చిన్నపా టి అప్రమత్తత అవసరం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇం టిపై పోలీసుల నిఘా ఉంటుంది. లేకుంటే దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్తారు జాగ్రత్త అని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌తో చోరీలకు చెక్‌
చోరీల నివారణకు పోలీసు శాఖలో ఏడాది క్రితం ‘లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.  ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ ద్వారా పని చేసే సీక్రెట్‌ కెమెరా ద్వారా పోలీసులు చోరీలను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు . ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వచ్చినప్పుడు యాప్‌లో రిక్వెస్ట్‌ ప్రొటెక్షన్‌ను క్లిక్‌ చేస్తే వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు మెసేజ్‌ వెళ్తుంది. కొన్ని నిమిషాల్లోని పోలీసులు ఆ ఇంటికి వచ్చి నిఘా కెమెరాను అమరుస్తారు. ఈ నిఘా కెమెరా యజమాని మొబైల్‌తో పాటు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తారు. కడప, ప్రొద్దుటూరులో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. తాళం వేసిన ఇంట్లోకి ఎవరైనా దొంగలు ప్రవేశించి కెమెరా ముందుకు వెళ్లగానే యజమాని సెల్‌కు, పోలీస్‌కంట్రోల్‌ రూంకు మెసేజ్‌ వెళ్లి అలారం మోగుతుంది. దీంతో కొన్ని క్షణాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకుంటారు.

జిల్లా వ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలు..
జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1,53,180 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కడపలో 65,510, ప్రొద్దుటూరులో 50,380 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని స్టేషన్‌లలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, మైదుకూరులో కూడా లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టంను అందుబాటులోకి తెచ్చారు. యాప్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, బ్లూకోల్ట్స్‌ పోలీసులు వాహనాల్లో తిరుగుతూ ప్రజలకు యాప్‌ గురించి వివరిస్తూ వారి మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. దాదాపు ప్రతి ఇంటికి స్మార్ట్‌ఫోన్‌ ఉంది. నియోజకవర్గంలో లక్షలు సెల్‌ఫోన్లు ఉండగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు తక్కువ సంఖ్యలో ఉండటంపై పోలీసు అధికారులు విస్మయం చెందుతున్నారు. చోరీల నివారణకు ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌తో80 శాతం తగ్గిన చోరీలు
లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌లో 80 శాతం మేర చోరీలు తగ్గాయి. 2016లో 79 చోరీలు, 2017లో 84 చోరీలు జరుగా 2018లో కమాండ్‌ కంట్రోల్‌ను  ఏర్పాటు చేసి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను అనుసంధానం చేసిన తర్వాత 32 చోరీలు మాత్రమే జరిగాయి. 2016లో రాత్రి ఇళ్లకు కన్నం వేసిన చోరీలు 21, 2017లో 12 జరిగాయి. 2018లో 5 చోరీలు మాత్రమే జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.  2016లో రూ. 90,48,800, 2017లో రూ. 74,44,950 విలువ చేసే సొత్తు చోరీ కాగా 2018లో రూ. 27,45,350 మాత్రమే సొత్తు చోరీ అయింది.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌కెమెరాకు దొరికిన దొంగలు
∙జిల్లాలో యాప్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కడపలో ఏడాది కిత్రం నిఘా కెమెరా ఏర్పాటు చేసిన ఓ ఇంటిలో దొంగ ప్రవేశించగా ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి నిందితుడిని పట్టుకున్నారు. దొంగను విచారించగా అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున సొత్తును పోలీసులు రికవరీ చేశారు.
∙ఇటీవల ప్రొద్దుటూరులోని వైఎస్‌ నగర్‌లో ఇంట్లో చోరీకి ప్రయత్నించిన అంతర్రాష్ట్ర దొం గను పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ నిఘా కెమెరా సాయంతో పట్టుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన అతను కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చోరీలకు పాల్ప డ్డాడు. అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు సహకరించండి
వేసవిలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు పోలీసుశాఖకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫలితంగా చోరీలు జరగడానికి అవకాశం ఉండదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టంతో మేమే నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి దొంగల ఆట కట్టిస్తాం. బంధువుల ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే ఇంట్లో  ఒకరు ఉండేలా చూసుకుంటే మంచిది. అలా కాకపోతే తాళం వేసిన ఇంటి బయట రాత్రి వేళల్లో లైట్లు వెలిగేలా చూడాలి. ఇంట్లో  నగదు, ఆభరణాలు పెట్టవద్దు.     – శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement