ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు కలేనా..! | People's Problems With The Lack Of A Trauma Care Center | Sakshi
Sakshi News home page

ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు కలేనా..!

Jun 18 2018 11:31 AM | Updated on Jun 18 2018 11:31 AM

People's Problems With The Lack Of A Trauma Care Center - Sakshi

క్షతగాత్రులను అంబులెన్స్‌లో క్షతగాత్రులను తరలిస్తున్న దృశ్యం  

విజయనగరం ఫోర్ట్‌ : ఈ నెల 13వ తేదీన భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 30 మంది వరకు గాయపడ్డారు. చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి మాత్రమే భోగాపురం, జిల్లా కేంద్రాస్పత్రుల్లో చికిత్స అందింది. మరో 12 మంది వరకు క్షతగాత్రులను విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అలాగే ఈ నెల 6వ తేదిన గజపతినగరం  వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

మరో క్షతగాత్రుడిని విశాఖపట్న కేజీహెచ్‌కు తరలిచారు. ప్రమాదాలు అధిక గాయాలైన వారికి జిల్లా ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ప్రతి ఒక్కరినీ విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేసేస్తున్నారు. ట్రామాకేర్‌ సెంటర్‌ జిల్లాలో ఉంటే క్షతగాత్రులకు మెరుగైన సేవలు అంది ఉండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో జిల్లాలో ట్రామాకేర్‌ ఏర్పాటు చేయాలన్న హామీ కలగానే మిగిలిపోయింది.

అధికారుల హడావుడే తప్ప ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. ట్రామాకేర్‌ సెంటర్‌  ప్రతిపాదించి దాదాపు మూడేళ్లవుతున్నా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారిపై నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్చే లోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన 5, 10 నిమషాల్లో చికిత్స అందించగలిగితే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు.  

పరిశీలనలే మిగిలాయి..

ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన అంటూ రాష్ట్ర స్థాయి అధికారులు కొన్నేళ్లుగా పరిశీలనలు చేయడం తప్ప ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మూడేళ్ల కిందట కూడా ఓ అధికారి భోగాపురం, రామభద్రపురంల్లో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. కాని ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.

కేజీహెచ్‌కు తరలించాల్సిందే..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ స్థానికంగా వైద్యం అందకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు గాని, ప్రైవేట్‌ ఆస్పత్రికి గాని తరలిస్తున్నారు. కేజీహెచ్‌లో అయితే ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రైవేటఆస్పత్రుల్లో అయితే రూ. వేలల్లో వెచ్చించాల్సిన పరిస్థితి. 

ట్రామ్‌కేర్‌లో మెరుగైన సౌకర్యాలు..

క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు ఎముకల వైద్యులు ముగ్గురు, జనరల్‌ ఫిజీషియన్‌ ఒకరు, ఎంబీబీఎస్‌  వైద్యులు ముగ్గురు, నర్సింగ్‌ సిబ్బంది 10 మంది వరకు ఉంటారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ట్రామాకేర్‌ సెంటర్‌కు తీసుకుని వెళితే తక్షణ వైద్యసేవలు అందిస్తారు. దీని వల్ల నూటికి 80 శాతం మంది వరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి జిల్లాలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement