మాఫీ మాయ | peoples are concern on debt waiver | Sakshi
Sakshi News home page

మాఫీ మాయ

Published Wed, Aug 20 2014 2:26 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

మాఫీ మాయ - Sakshi

మాఫీ మాయ

అన్నదాతలు, డ్వాక్రా సంఘాల మాదిరిగానే ఎస్సీ, బీసీ, చేనేత తదితర వర్గాలు కూడా చంద్రబాబు రుణమాఫీ హామీపై ఆశలు పెట్టుకున్నాయి.

అప్పు తీరిపోతుందంటే ఎవరికైనా ఆనందమే. ఈ కొద్దిపాటి సంతోషాన్నీ శ్రామిక, కర్షక జీవుల నుంచి దూరం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అంటూ సవాలక్ష నిబంధనలతో గందరగోళం సృష్టించిన ప్రభుత్వం.. ఇతర వర్గాలకూ రుణమాఫీ అమలు చేయడంపై మీనమేషాలు లెక్కిస్తోంది. రుణమాఫీ అంటూ నమ్మించి.. అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు దిక్కులు చూడడం ప్రజానీకానికి విస్మయం కలిగిస్తోంది.
 
సాక్షి, కాకినాడ : అన్నదాతలు, డ్వాక్రా సంఘాల మాదిరిగానే ఎస్సీ, బీసీ, చేనేత తదితర వర్గాలు కూడా చంద్రబాబు రుణమాఫీ హామీపై ఆశలు పెట్టుకున్నాయి. అధికారంలోకి రాగానే వారి రుణాలన్నీ మాఫీ చేస్తాననడంతో వీరంతా గత ఆరేడునెలలుగా బకాయిలు చెల్లించడం మానేశారు. ప్రమాణ స్వీకారం రోజునే రుణమాఫీ ఫైలుపై ‘బాబు’ తొలి సంతకం చేయడంతో తామంతా రుణ విముక్తులమయ్యామని సంబరపడ్డారు. బాబు అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తున్నా.. రుణమాఫీపై ఇప్పటి వరకు మార్గదర్శకాలు జారీకాకపోవడంతో ఏం చేయాలో పాలుపోక వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
 
అగమ్యగోచరంగా చేనేత కార్మికులు
జిల్లాలో రెండు లక్షల మందికి పైగా చేనేత కార్మికులు ఉన్నారు. వారిలో లక్ష మందికి పైగా మగ్గాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీవర్స్ క్రెడిట్ కార్డుల కింద 2 వేల మంది కార్మికులకు రూ.4.50 కోట్లు, పవర్ లూమ్స్‌పై రూ.కోటి వరకు రుణాలు ఉండగా, డీసీసీబీ నగదు పరపతి కింద సొసైటీలకు ఇచ్చిన రుణాలు మరో రూ.11 కోట్ల వరకు ఉన్నాయి. ఇవన్నీ రద్దవుతాయనుకున్న కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది 3,688 మంది కార్మికులు వీవర్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రుణ సాయం పొందేందుకు అర్హత సాధించారు. వీరంతా రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. బకాయిల చెల్లింపులునిలిచిపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలివ్వడం లేదు. దీంతో పెట్టుబడుల్లేక, ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.ఐదు, రూ.పది వడ్డీలకు చేసిన అప్పులు తీర్చలేక కొట్టుమిట్టాడుతున్నారు.
 
ఎస్సీల రుణ బకాయిలు రూ.70.83 కోట్ల పైమాటే..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం 10,590మంది తీసుకున్న రుణాలు రూ.70. 83 కోట్ల మేరకు ఉన్నాయి. 4201 మంది లబ్ధిదారుల పాత బకాయిలు రూ.11.15 కోట్లు ఉండగా, ఎన్‌పీఏ (నాన్ పెర్‌ఫార్మెన్స్ అసెట్స్) కింద 1507 మందికి సంబంధించి రూ.5.03 కోట్లు మేరకు పేరుకుపోయాయి. బాబు అధికారంలోకి వస్తే తమ రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎస్సీ వర్గీయులు గంపెడాశ పెట్టుకోగా, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది.వీరు ఆరేడు మాసాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో కొత్త రుణాలు పుట్టకపోగా, బకాయిల కోసం బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు.
 
దిక్కుతోచని బీసీ వర్గాలు
బీసీ వర్గీయుల పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టుగా తయారైంది. బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లావ్యాప్తంగా 6479 మందికి సంబంధించి రూ.28.68 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటిలో 1401 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ.1.40 కోట్ల పాత బకాయిలుండగా, ఎన్‌పీఏ కింద 884 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ.2.73 కోట్ల వరకున్నాయి. ఎస్సీ కార్పొరేషన్‌లో బకాయిలపై ఎప్పటికప్పుడు నివేదికలు కోరుతున్న బ్యాంకింగ్ అధికారులు.. బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి రుణాల కోసం నివేదికలు కోరడం లేదు. దీంతో అసలు తమ రుణాలు మాఫీ అవుతాయో, లేదోననే ఆందోళన ఈ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రుణ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త రుణాలు మంజూరు చేయబోమని ఇప్పటికే బ్యాంకర్లు లబ్ధిదారులతో పాటు ఆయా సంస్థల అధికారులకు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో ఇటు లబ్ధిదారులు, అటు అధికారులు కూడా రుణమాఫీపైనే ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement