తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు నవ్వుకునేలా ఉంటున్నాయి. జీవనదుల్లోని ఇసుకకు డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతలపై అనేక ఆరోపణలున్నాయి.
ఇసుక అక్రమార్కుల విషయంలో గందరగోళం
టీడీపీ నేతలపై కేసులు పెడతారా అంటున్న జనం అక్రమార్కుల
విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నంటున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు నవ్వుకునేలా ఉంటున్నాయి. జీవనదుల్లోని ఇసుకకు డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతలపై అనేక ఆరోపణలున్నాయి. అయితే అక్రమార్కులపై పీడీ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) యాక్టు అమలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విని అంతా నవ్వుకుంటున్నారు. సామాన్య, మధ్యతరగతి వ్యక్తులు ఇల్లు కట్టుకోవాలంటే ఒకప్పుడు సిమెంట్, ఐరెన్ ధరల్ని చూసి గగ్గోలు పెట్టేవాడు.
ఇప్పుడుఇసుక ధరను చూసి బెంబేలెత్తిపోయిన పరిస్థితి. క్యూబిక్ మీటర్‌కు ఇసుక ధరను సృష్టించి, మహిళా సంఘాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దీని వెనుక ఎంతమంది బినామీలు, టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు, నేతలు లబ్ధి పొందారో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిందే. సీసీ కెమెరాలు, ఆన్‌లైన్ వ్యవస్థ, జీపీఎస్ సిస్టమ్ అంటూ ఊదరగొట్టినా అవన్నీ ప్రకటనలకేనని, రాత్రి వేళల్లో ఎంత స్థాయిలో ఇసుక అక్రమరవాణా జరుగుతుందో అందరికీ తెలిసిందే. అక్రమాలు పెరిగిపోతుండడంతో పీడీ యాక్టు తప్పదని ప్రభుత్వం ప్రకటించినా అదీ కొన్నాళ్లకే పరిమితమని అధికారులే చెబుతున్నారు.
ఇలా జరిగింది..
టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 32 ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు జరిగాయి. వంశధార, నాగావళి నదుల పరీవాహక ప్రాంతాల్లో రీచ్‌ల్ని ఏర్పాటు చేశారు. సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర విక్రయాలు నిర్వహించినప్పటికీ ఇందులో ఎవరి వాటాలు వారికి చేరిపోయాయి. అనధికారికంగా మరో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోయిందనే ఆరోపణలొచ్చాయి. ఐదు నియోజకవర్గాల్లో అక్రమాలు చోటు చేసుకోగా చాలా ప్రాంతాల్లో టీడీపీ నేతల అనుచరుల ప్రమేయమే బయటపడింది. ఏడాది కాలంలో ఈ అక్రమాలవల్ల ప్రభుత్వానికి కనీసం రూ.10 కోట్లు చేరకుండా పోయిందని అంచనా. కొత్తూరు మండలంలో ఓ రీచ్ నిర్వహించినా అది కొన్నాళ్లే నడిచింది. సుమారు 2,250 క్యూబిక్ మీటర్ల విక్రయాల అనంతరం దాన్ని మూసేశారు. నరసన్నపేట మండలం చేనులవలసలో మరో ర్యాంపు ఏర్పాటు చేస్తే 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు చేపట్టగా వాటిలో చాలా మటుకు టీడీపీకి చెందిన కార్యకర్తలే సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి.
అక్కడ ఏ విధంగా అన్యాయం జరిగిందో కలెక్టర్ సైతం గుర్తించారు. ఆమదాలవలస పరిధిలో సింగూరు, ముద్దాడపేట, తోటాడ పరిధిలో ఇప్పటివరకు రూ.3 కోట్ల అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతుండగా అంతకు రెండింతల అనధికార రవాణా జరిగిందనే విమర్శలున్నాయి. కొన్నాళ్ల క్రితం రేగిడి మండలం కందిశలో, సంతకవిటి మండలం తమరాంలో రీచ్‌లేర్పాటు చేసినా ఫలితం రాలేదు. పొన్నాడ రేవులో సుమారు 18 వేల క్యూబిక్ మీటర్ల విక్రయించగా రూ.కోటి వరకు ఆదాయం వచ్చింది. ముద్దాడపేటలో సుమారు 42 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయిస్తే సుమారు రూ.2.36కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఆగస్టులో ఈ రెండింటినీ నిలిపేసినా అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోందని ఇటీవల విజిలెన్స్ అధికారులు చేపట్టిన దాడుల్లో స్పష్టమైంది.
రానున్న రోజుల్లో తమరాం, తలవరం, హయాతినగరం రేవుల్లో విక్రయాలు ప్రారంభిస్తామని చెబుతున్నా పొరుగు జిల్లాకే అది పరిమితం అవుతుందని అధికారులే చెబుతున్నారు. హయాతినగరంలో జరిగిన అక్రమాల్ని ‘సాక్షి’ గతంలో వెలుగులోకి తీసుకురావడంతో కొన్నాళ్లు ఇసుక సరఫరా ఆపేశారు. మంత్రి బంధువులు దాని జోలికి వెళ్లకుండా విపక్షపార్టీ నేతలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా కేసులు నమోదు చేయని అధికారులు..ఇప్పుడు ప్రభుత్వం పీడీ యాక్టు అమలు చేస్తామని ప్రకటించడంతో అంతా నవ్వుకుంటున్నారు.