కిలో ఉల్లిపాయలు రూ.15కే | Sakshi
Sakshi News home page

కేపీ ఉల్లి సిద్ధం!

Published Thu, Jan 2 2020 12:25 PM

Onion Supply From Mydukur Market to Krishna - Sakshi

సాక్షి, మచిలీపట్నం:  సామాన్యులపై భారం పడకూడదన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు సరఫరా చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతున్నప్పటికీ రైతు బజార్లలో మాత్రం కిలో రూ.25లకే సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.15కే కృష్ణాపురం (కేపీ) ఉల్లిపాయలను విక్రయించాలని నిర్ణయించింది.   

జిల్లాలో రోజుకు సుమారు150 టన్నుల ఉల్లి వినియోగం  
జిల్లాలో ప్రతి రోజు 120 నుంచి 150 టన్నుల ఉల్లి వినియోగం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా వరదలు, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బ తినడంతో సెప్టెంబర్‌ నుంచి ఉల్లి ధరలు ఆకాశానికి ఎగబాకడం మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధులు ఉపయోగించి పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకుని సబ్సిడీ రేట్లకే ప్రజలకు అందిస్తోంది. సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి నెల రోజుల పాటు కొనసాగించిన ప్రత్యేక కౌంటర్లు, తిరిగి నవంబర్‌ 27వ తేదీ నుంచి ప్రారంభమై నేటి వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం కిలో రూ.100 నుంచి రూ.150 వరకు ధర వెచ్చించి కొనుగోలు చేసి జిల్లాలోని స్థానిక రైతు బజార్లలో కిలో రూ.25లకే వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు జిల్లాలో 1327 మెట్రిక్‌ టన్నుల (ఎం.టీల) ఉల్లిపాయలను సబ్సిడీ ధరకే విక్రయాలు జరిపారు.

మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, రాజస్థాన్‌లోని ఆళ్వార్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కర్నూలు, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలు చేసి జిల్లాలో సబ్సిడీపై విక్రయాలు చేశారు. కాగా ప్రస్తుతం కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలోని కృష్ణాపురం (కేపీ) ఉల్లిపాయలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో కేపీ ఉల్లి సాగవుతోంది. సాధారణ ఉల్లి కంటే చిన్న సైజు (50 ఎం.ఎం)లో ఉండే ఈ ఉల్లి ప్రస్తుతం కిలో రూ.50కు పైగా పలుకుతోంది. ఆ ధరకే మైదుకూరు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసి రప్పించేందుకు మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కర్నూల్, నాసిక్‌ తదితర రకాల ఉల్లిపాయలను సబ్సిడీపై కిలో రూ.25కు విక్రయిస్తుండగా, చిన్న సైజులో ఉండే కేపీ ఉల్లిపాయలను కిలో రూ.15కే అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అక్కడ మార్కెట్‌కు వచ్చే సరుకును బట్టి రోజుకు 50 నుంచి 60 టన్నుల చొప్పున కొనుగోలు చేసి జిల్లాలోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు జరపాలని సంకల్పించినట్టు మార్కెటింగ్‌ ఏడీ ఎం.దివాకర్‌బాబు సాక్షికి తెలిపారు. గురువారం నుంచి కేపీ ఉల్లిపాయల అమ్మకాలకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement