పొమ్మనలేక పొగ | one time sylinder distribution for midday meal centres | Sakshi
Sakshi News home page

పొమ్మనలేక పొగ

Oct 5 2017 1:17 PM | Updated on Oct 5 2017 1:17 PM

శ్రీకాకుళం , వీరఘట్టం: పొమ్మనలేక పొగపెట్టడమంటే ఇదేనేమో.. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తీరా మొదటి గ్యాస్‌ బండ ఖాళీగా కాగానే తర్వాత వంటకు వంట ఏజెన్సీ మహిళలే స్వయంగా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా చేస్తే వారికి ఆర్థిక భారమై ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటారని ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఆనక ఎంచక్కా ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టి కమీషన్లు కాజేయవచ్చుననే ఎత్తుగడ చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచింది. ఇన్నేళ్లుగా విద్యార్థులకు రుచికరమైన భోజనం వండి పెడుతున్న మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇటీవల ఆగమేఘాల మీద ప్రతీ పాఠశాల వంట ఏజెన్సీకీ గ్యాస్‌ కనెక్షన్‌ అందజేసింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు తమ స్కూల్‌ మెయింటినెన్స్‌ నిధుల నుంచి రూ.2.808 వెచ్చించి గ్యాస్‌ కనెక్షన్‌ బుక్‌ చేశారు. అయితే మొదట గ్యాస్‌ బండ ప్రభుత్వం ఇచ్చింది. ఈ బండ ఖాళీగానే తదుపరి వంటకు గ్యాస్‌ బండ వంట ఏజెన్సీల మహిళలు కొనుక్కోవాలి. ఇలాగైతే వారికి గిట్టుబాటుగాక స్వచ్ఛందంగా తప్పుకుంటారని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  

ఏం జరుగుతోంది..
జిల్లాలో 379 ఉన్నత, 430 ప్రాథమికోన్నత, 2,356 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇంత వరకు 2,404 పాఠశాలలకు గ్యాస్‌ కనెక్షన్లు కొనుగోలు చేశారు. మిగిలిన 761 పాఠశాలల్లో నిధుల లేమితే కొన్నిచోట్ల, హెచ్‌ఎంలు అందుబాటులో లేక మరికొన్ని చోట్ల గ్యాస్‌ కనెక్షన్లు కొనుగోలు చేయలేదు. దసరా సెలవుల తర్వాత మంగళవారం పాఠశాలలు తెరుచుకున్నందున ఈ మేరకు ఒక గ్యాస్‌ బండ, రెగ్యులేటర్, కనెక్షన్‌ బాండ్‌ అందజేశారు. పొయ్యిలు మాత్రం ఏజెన్సీలే కొనుక్కోవాలి. అంటే రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఖర్చు చేస్తే గాని  నాణ్యమైన పొయ్యిలు దొరికే పరిస్థితి లేదు.

ఏజెన్సీలను తప్పించే ఎత్తుగడ
100 మంది విద్యార్థులున్న పాఠశాలలో ప్రతినెలా పాఠశాల పనిదినాల్లో వంటలు వండేందుకు రూ.500 కట్టెలు సరిపోతున్నాయి. అదేగ్యాస్‌తో నెలకు నాలుగు బండలు అవసరమవుతాయని అంచనా. ఇలాగైతే ప్రస్తుతం గ్యాస్‌ ధర బట్టి చూస్తే నాలుగు బండలకు రూ. 2,640 ఖర్చు అవుతోంది. అంటే కట్టెలు కంటే గ్యాస్‌ పొయ్యిపై వంట చేస్తే ఐదు రెట్లు ఖర్చు అధికమవుతుంది. ఇంత ఖర్చు చేయాలంటే ఏజెన్సీలకు భారం కానుంది.

రాయితీపై గ్యాస్‌ ఇవ్వాలి
ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలంటే గ్యాస్‌ పొయ్యిని ఉచితంగా అందజేసి, 50 శాతం రాయితీపై గ్యాస్‌ కనెక్షన్‌ సరఫరా చేయాలి. అలాగైతే∙మధ్యాహ్నం వంట సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. దాంతో వంట ఏజెన్సీ మహిళలతోపాటు విద్యాశాఖ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

తర్వాత బండ గురించి తెలీదు
గ్యాస్‌ పంపిణీపై విద్యాశాఖ ఉన్నతాధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఒక గ్యాస్‌ బండ ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమని, తర్వాత వంట అవసరాలకు కావాల్సిన గ్యాస్‌ బండల గురించి ఆదేశాలు లేవంటున్నారు. బహుశా వంట ఏజెన్సీ వారే తర్వాత బండలను సొంత ఖర్చులతో కొనుక్కోవాలని చెప్పకనే చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement