తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట | Sakshi
Sakshi News home page

తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట: వైవీ సుబ్బారెడ్డి

Published Wed, Jan 1 2020 3:01 PM

One Free Laddu To Every Devotee, Says YV subbareddy - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా కలకలం కొనసాగాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన‍్నారు. ఆయన బుధవారం గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే వైకుంఠ ఏకాదశి నుంచి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ స్వామివారి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని అందుకే రైతుల పేరుతో రాజధాని డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. అమరావతిలో బినామీ పేర్లతో కొన్న భూములకు విలువ పడిపోతుందన్న భయంతో కుట్ర రాజకీయాలు చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. 

రాష్ట్రాన్ని రెండు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డ ఆయన టీడీపీ భూముల కోసం లక్ష కోట్లు పెట్టి అభివృద్ధి చేయాలా అని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి భావిస్తుంటే, ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలని ప్రయత్నిస్తోందన‍్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కాగ అంతకు ముందు టీటీడీ చైర్మన్‌... రాజ్ భవన్‌లో గవర్నర్ బీబీ హరిచందన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి కేలండర్, ప్రసాదాలను అందచేశారు. టీటీడీ అర్చకులు గవర్నర్‌కి వేదాశీర్వాదం అందించారు. 

Advertisement
Advertisement