'టీడీపీ ఆవిర్భావ ముహూర్తమే మంచిదికాదు'
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ముహూర్తమే బలంగాలేదని ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ కాళిదాస్ శర్మ అభిప్రాయపడ్డారు.
పార్వతీపురం (విజయనగరం జిల్లా): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ముహూర్తమే బలంగాలేదని ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ కాళిదాస్ శర్మ అభిప్రాయపడ్డారు. శుక్రవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1982 మార్చి 29న కృత్తిక నక్షత్రం తృతీయ తరుణం కర్కాటక లగ్నంనందు జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ముహూర్తం ప్రకారం కాలచక్ర ప్రశ్నానుసారం నాయకులకు గ్రహ ప్రభావం ఉంటుందని తెలిపారు. రాహువు, బుధ గ్రహాల ప్రభావంతో నిత్యం పార్టీకి, నాయకుడికి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.
ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతిమణి భువనేశ్వరీదేవి పీఏ అజయ్‌కుమార్‌తో మే10 నుంచి జూన్27 వరకు పార్టీకి గడ్డు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పానని కాళిదాస్ శర్మ అన్నారు. అయితే ఈ దోషానికి పరిష్కార మార్గాన్ని సూచించినా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. అంతేకాకుండా బుధుడు, రాహువుల ప్రభావం కారణంగానే ఆ పార్టీ అప్పటి అధినేత నందమూరి తారకరామారావుకు హార్ట్ సర్జరీ, నాదెండ్ల భాస్కర్‌రావుకు రాజకీయ చిత్రదోషం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అదే విధంగా చంద్రబాబునాయుడికి అలిపిరి సంఘటన జే ష్ఠ నక్షత్రంలో బుధ గ్రహ ప్రభావంతోనే జరిగిందని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ గ్రహ ఫలితాలను బాగా నమ్మేవారని, అందువల్లే నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తాన్ని నాటకీయంగా ఆలస్యం జరిగేలా జాగ్రత్త వహించారని చెప్పారు. దీంతో నెల రోజుల్లోనే నాదెండ్ల భాస్కర్‌రావు పదవి కోల్పోయాడని పేర్కొన్నారు. అయితే, నేడు జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబునాయుడి ప్రమాణస్వీకార ముహూర్తం కారణం కాదని, అది పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉన్న దోషం వల్ల జరుగుతున్నదేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని నిర్ణయించింది కాళిదాస్‌శర్మ కావడం విశేషం.


