కుక్క కరిచిందో అంతే..!

No Vaccines For Dog Bites in Vizianagaram - Sakshi

ప్రభుత్వాస్పత్రుల్లో కానరాని ఏఆర్‌వీ వ్యాక్సిన్‌

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కే రాని వైనం

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న కుక్కకాటు బాధితులు  

విజయనగరం ఫోర్ట్‌: ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో కుక్క కాటుకు మందులు కూడా లేని పరిస్థితి నెలకొంది. ర్యాబిస్‌ వ్యాక్సిన్లు ఎక్కడా అందుబాటులో లేవు. నిజానికి కుక్క కాటు వేసిన వెంటనే సకాలంలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. లేనిపక్షంలో ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. సామాన్య ప్రజానీకం కుక్క కరిస్తే చాలు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు పరిగెత్తుతున్నారు. కానీ ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లి పెద్ద ఎత్తున చేతి చమురు వదిలించుకుని వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. ఏఆర్‌వీ (యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌) కొరత సర్కారీ దవాఖానాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గతిలేని పరిస్థితుల్లో కుక్కకాటు బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు కొనుగోలు చేసి వేయించుకుంటున్నారు.

భయ పెడుతున్న శునకాలు..
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా శునకాలు నిత్యం ప్రజలను భయపెడుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాటి కాటు బారిన రోజు ప్రజలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే అటువైపుగా వెళ్లేందుకు జనం హడలిపోతున్నారు. నెలకు జిల్లాలో 2 వేల నుంచి 4వేల వరకు జనాలు కుక్కకాటు బారిన పడుతున్నారు.

జిల్లాలో 3లక్షల పైచిలుకు శునకాలు..
జిల్లాలో 3 లక్షలు పైగా శునకాలు ఉన్నాయి. పగలు, రాత్రి అని తేడా లేకుండా నిత్యం వీధుల్లో సంచిరిస్తూ జనాలు, పశువులు, కోళ్లపై దాడి చేస్తున్నాయి. జనంతో పాటు, ఆవులు, గేదెలు, కోళ్లు ఎక్కువగా శునకాల కాటు బారిన పడుతున్నాయి. పెద్ద సంఖ్యలో అవి చనిపోతున్నాయి.

ఏ ఆస్పత్రికీ సరఫరా కాని వ్యాక్సిన్‌..
జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 8 సీఎం ఆరోగ్య కేంద్రాలు, 13 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి ఉన్నాయి. వీటిన్నంటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆవరణలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి మందులు, వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. కానీ ఇటీవల కాలంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌కే ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ రాలేదు. ప్రస్తుతం కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి అధిక సంఖ్యలో కుక్కకాటు బాధితులు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ కోసం వస్తున్నారు. కేంద్రాస్పత్రికి సగటున రోజుకు 20 నుంచి 40 మంది వరకు వస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రులనుఆశ్రయిస్తున్న బాధితులు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ లేక పోవడంతో కుక్క కాటు బా«ధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్‌ మూడు ధపాలుగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ఈ మూడుసార్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు వెచ్చించి వేసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వేసే వ్యాక్సిన్‌ గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం సరఫరా చేయని మందులను ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి లోకల్‌గా అధికారులు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ మాత్రం లోకల్‌గా కొనుగోలు చేయడానికి వీలులేదని అధికారులు చెబుతున్నారు.

వ్యాక్సిన్‌ రాలేదు..
సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ లేదు. ప్రభుత్వమే వ్యాక్సిన్‌ సరఫరా చేస్తుంది. లోకల్‌గా కూడా ఈ వ్యాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవు.– డాక్టర్‌ కె.విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top