ఈ నగరానికి ఏమైంది..?

No Smoking Day Special Story - Sakshi

ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్‌ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. ప్రకటన చూడడమే తప్ప పొగరాయుళ్లలో ఎటువంటి చలనం కలగడం లేదు. కాల్చే సిగరెట్‌లో నికోటిన్‌ విషతుల్యమైన మత్తు పదార్ధం ఉంటుంది. సిగరెట్, బీడీ తాగే వారిలో ఈ విషం శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేటి యువత ధూమపానాన్ని క్రేజీగా భావిస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటోంది. పొగతాగడం వ్యసనంగా మారితే ప్రాణాన్నే హరిస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నేడు నో స్మోకింగ్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

సాక్షి, తిరుపతి (అలిపిరి): పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. సిగరెట్‌ ప్యాకెట్‌పైనే ప్రాణాంతకం అంటూ రాసుంటుంది. అయినా పొగతాగేవారు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం విషవాయువుల నడుమ హరిస్తున్నా.. పొగతాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేటి యువత ధూమపానాన్ని క్రేజ్‌గా  భావి స్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించినా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.

ఊపిరితిత్తులకు ముప్పు

పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ శరీరానికి అందుతుంది. హానికర కార్బ న్‌ డైయాక్సైడ్‌ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్‌ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్‌ మోనాక్సైడ్, సైనైడ్‌ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్‌ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్‌ మోనాక్సైడ్‌తో కణాలు విషపూరితమవుతాయి. ఫలితంగా పలు వ్యాధులు సోకుతాయి.

పీల్చేవారికీ ప్రమాదమే

పొగ తాగేవారి కంటే పీల్చే వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారిని యాక్టివ్‌ స్మోకర్‌గా, పీల్చేవారిని పాసివ్‌ స్మోకర్‌గా పిలుస్తారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారు కూడా పలు రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం, ఒక వేళ పిండం ఎదిగినా చివర్లో మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు మహిళలను వేధించే అవకాశం ఉంది.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 కోట్ల మంది పొగతాగే వారున్నట్లు అంచనా. ఒక సిగరెట్‌ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్‌ అలవాటు ఉన్న వారు మానేస్తే, 20 ఏళ్ల తరువాత లంగ్స్‌ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

గొంతు క్యాన్సర్‌

పొగ తాగేవారిలో నోటి, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం వుంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా.. ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని అవయవాలన్నింటికీ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. పొగతాగే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ.

నష్టం ఎంతంటే..

♦ ఒక సిగరెట్‌ తాగితే 43 రకాల విషవాయువులు వెలువడుతాయి. ఎంఫసియా,క్రానిక్‌ అబ్‌స్ట్రిక్టవ్‌ పల్మ్‌నరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకర మైన వ్యాధులు సోకుతాయి.

♦ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు అవకాశం ఎక్కువ.

♦ దుర్వాసనతో నోరు,పెదాలు, నాలుక క్యాన్సర్లు వస్తాయి.

♦ ముఖంపై మచ్చలు ఏర్పడుతాయి.

♦ పళ్లు రంగు మారుతాయి.

♦ కనుగుడ్డు మీదా ప్రభావం ఉంటుంది.

♦ ఊపిరితిత్తులు క్యాన్సర్‌ వస్తుంది.

♦ గుండెపోటుకు అవకాశం ఎక్కువ.

♦ రక్త ప్రసరణ ప్రక్రియ మందగిస్తుంది.

♦ కడుపులో ప్రమాదకర యాసిడ్‌లు ఉత్పత్తి అవుతాయి.

♦ మూత్రాశయం..మూత్రపిండాలు దెబ్బతింటాయి.

♦ శరీరంలో అన్ని భాగాలు దెబ్బతింటాయి.

♦ పొగపీల్చే మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. 

అమలుకు నోచుకోని చట్టాలు

బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. బహిరంగంగా పొగ తాగుతూ అధికారులకు పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా.. రెండో సారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా.. ఒక్కో సందర్భంలో రెండు శిక్షలు అమలు చేయవచ్చు.  ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ 2014లో చట్టంలో నిబంధనలు మార్చాలని భావించి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం ధూమపాన సేవనానికి ఉన్న వయోపరిమితిని 18 నుంచి 25 ఏళ్లుగా చేసింది. నిబంధన అమలుకు నోచుకోలేదు. 2003లో పొగాకు నిషేధ చట్టం ప్రకారం విశ్వ విద్యాలయాల్లో వంద గజాల దూరంలో ఎలాంటి పొగాకు విక్రయ కేంద్రాలు ఉండకూడదు. 

ధూమపానానికి తప్పదు భారీ మూల్యం

ఒక సిగరెట్‌ తాగితే ఏమౌతుందులో అనే అలోచను విడనాడాలి. పొగ, గుట్కాలు వంటివి తీసుకోవడం వల్ల  శరీరం అనేక వ్యాధుల బారినపడుతుంది. దీంతో శరీరాన్ని విష వాయువు పీల్చిపిప్పి చేసే ప్రమాదం ఉంది. యువత స్టైల్‌ కోసం స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు అలవాటుపడి వారు చాల ఏళ్లు పాటు ఇబ్బందులు పడితేగాని మానలేకపోతున్నారు. స్మోకింగ్‌కు దూరంగా వుండడం ఉత్తమం.
– డాక్టర్‌ ఎస్‌.సుబ్బారావు, అసోసియేట్‌ ప్రొఫెసర్, పల్మొనరీ మెడిసిన్, రుయా ఆస్పత్రి

సున్నిత పొరలకు ప్రమాదం

ధూమపానంతో కళ్లు, ముక్కు, గొంతులో సున్నిత పొరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గుండె పోటు వచ్చే శాతం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొగతాగడానికి యువత దూరంగా వుండాలి.
– డాక్టర్‌ సూర్యప్రకాష్, సీనియర్‌ పాల్మనాలజిస్ట్, తిరుపతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top