త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్‌మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్‌మెంటల్ అధికారులను తొలగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడు (ఆర్‌ఐఓ) ప్రతాప్ పేర్కొన్నారు.
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్‌మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్‌మెంటల్ అధికారులను తొలగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడు (ఆర్‌ఐఓ) ప్రతాప్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరులోని జూనియర్ కళాశాలలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌కు డిపార్ట్‌మెంట్ అధికారులను కేటాయించకపోవడంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్‌మెంట్ అధికారులను తొలగిస్తారని వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. గతేడాది మాదిరిగానే ప్రాక్టికల్స్ జంబ్లింగ్ లేకుండానే జరుగుతాయన్నారు.
జిల్లాలో మొత్తం 530 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా త్వరలో జరుగనున్న పరీక్షలకు 308 కేంద్రాలను కేటాయించామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. థియరీ పరీక్షలు పూర్తయ్యేనాటికే పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే సమాధానపత్రాలు రాష్ర్టంలోని ఏ జిల్లాకైనా వెళ్లవచ్చన్నారు. ఒకవేళ అప్పటిలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రాంతానికి చెందిన పేపర్లు ఆయా ప్రాంతాల్లోనే వాల్యుయేషన్ చేస్తారన్నారు. అంతకుముందు ఆర్‌ఐఓ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, అంబేద్కర్, సింధు, చైతన్య, విజ్ఞాన్ కళాశాలలను తనిఖీచేశారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్ నిర్వహణకు కావాల్సిన ప్రయోగశాలలను పరిశీలించారు. ఆయన వెంట డెక్ సభ్యుడు బాలకృష్ణ ఉన్నారు.