
రూ.252 కోట్ల కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెట్టేందుకే మార్పు
ఆయన స్థానంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణ నియామకం
చక్రం తిప్పిన ప్రభుత్వంలోని కీలక నేత
సాక్షి, అమరావతి: అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రూ.252 కోట్ల కాంట్రాక్టు పనులను అస్మదీయ సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్నందునే ఆయన్ని బదిలీ చేసింది. రహదారి భద్రతా విభాగం డీజీగా అప్రాధాన్య పోస్టులో ఆయన్ను నియమించింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.252 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో చేపట్టే పనులను తమ బినామీకి అప్పగించాలని ప్రభుత్వంలో కీలక నేత ఒకరు పట్టుబట్టారు. అందుకు డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి సమ్మతించలేదు.
నిబంధనల మేరకే వ్యవహరిస్తానని తేల్చిచెప్పారు. మరోవైపు.. పరిశ్రమలు, వ్యాపార, విద్యా సంస్థలను తనిఖీల పేరుతో వేధించాలని ఆ కీలక నేత చెప్పారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలన్నారు. అలా చేస్తే పరిశ్రమలు, వ్యాపార, విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడవచ్చన్నది ఆ నేత ఉద్దేశం. అందుకు కూడా డీజీ మాదిరెడ్డి ప్రతాప్ సమ్మతించలేదు. నిబంధనల మేరకే తనిఖీలు నిర్వహిస్తామని, అక్రమ వేధింపులకు పాల్పడబోమని తేల్చిచెప్పారు.
తన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు స్పష్టంచేశారు. దీంతో, ఆ కీలక నేత భగ్గుమన్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఐజీ స్థాయి అధికారికి అగ్నిమాపక శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. ఆయన ద్వారా రూ.252 కోట్ల కాంట్రాక్టులు తమ అస్మదీయులకు కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. ఆ నేత ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. దీంతో.. మాదిరెడ్డి ప్రతాప్‌ను బదిలీ చేసిందని పోలీసు శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మాదిరెడ్డి ప్రతాప్ స్థానంలో వెంకట రమణ..
మాదిరెడ్డి ప్రతాప్‌ను రహదారి భద్రతా విభాగం డీజీగా నియమించిన ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణకు పూర్తి అదనపు బాధ్యతలతో ఆ శాఖ డీజీగా నియమించింది. అలాగే, వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎస్వీ శ్రీధర్‌రావును సీఐడీ విభాగం ఎస్పీగా నియమించింది. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.