పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
విజయనగరం: ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. నిండు నూరేళ్లూ కలసి జీవించాలని కలలుకన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నెల రోజులకే ఈ ప్రేమ జంట ప్రయాణం విషాదాంతమైంది. ఆశలు ఆవిరయ్యాయి. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
మృతులను నెల్లిమర్ల మండలం మెయిడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అత్తింటి వారు పెళ్లిని అంగీకరించలేదనే ఆందోళనతో భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలు పట్టింపులకు పోగా, ప్రేమ జంట మనో ధైర్యం కోల్పోయింది. నవ దంపతుల జీవితాలు అర్దాంతరంగా ముగిశాయి.