‘త్రిశూల’ వ్యూహంతో టీటీడీలో దళారులకు చెక్‌

New Master Plan For Dalari System In TTD - Sakshi

దళారీ వ్యవస్థపై యుద్ధం 

ఇంటి దొంగలనూ వదలరు

సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమలలో దళారులకు బ్రహ్మాస్త్రంగా మారిన సిఫార్సు లేఖలను నియంత్రించేందుకు టీటీడీ నడుంబిగించింది. త్రిశూల వ్యూహంతో దళారులుకు చెక్‌ పెట్టే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఏడుకొండలపై ఏళ్లుగా పాతుకుపోయిన దళారీ వ్యవస్థకు మూడు మార్గాల్లో అడ్డుకట్ట వేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. 
తొలి మార్గం ఇలా.. 
సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది, భక్తులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న వారిని గుర్తించి, అదుపులోకి తీసుకోవడం. గతంలో మాదిరి కాకుండా వారిపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించడం. 
రెండో మార్గం ఇలా.. 
దళారులు సిఫార్సు లేఖలు ఎలా పొందుతున్నారో గుర్తించడం.  సిఫార్సు లేఖలు అక్రమంగా పొందేవారిని అరికట్టడం.  
మూడో మార్గం ఇలా.. 
భక్తులు దళారులను ఆశ్రయించకుండా, సిఫార్సు లేఖలు లేకుండానే బ్రేక్‌ దర్శనాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధానం అవలంబించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను టీటీడీ ఇప్పటికే ప్రారంభించింది. విజిలెన్స్‌ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు పీఆర్వోల ముసుగులో దళారీతనం చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. ఇక నిత్యం సిఫార్సు లేఖలపై టికెట్లు జారీ చేసే జేఈఓ కార్యాలయంలో అక్రమార్కులు వివరాలను గుర్తించి, విజిలెన్స్‌ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటున్నారు.

ఇటీవల పట్టుకున్న దళారీ 65 రోజుల్లో 185 సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది, విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 46 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలను ఒక దళారీనే పొందాడు. అంటే పరిస్థితిని అర్థం  చేసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల పీఏలు వద్ద దళారీలు సిఫార్సు లేఖలను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సిఫార్సు లేఖలు జారీ చేసే ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేయాలని భావిస్తున్నారు. దళారులను పట్టుకున్న సమయంలో అతను సిఫార్సు లేఖలు పొందిన ప్రజా ప్రతినిధులకు సమాచారం అందిస్తే వారు అప్రమత్తంగా వ్యవహరిస్తారని టీటీడీ భావిస్తోంది.  

సామాన్యుల బ్రేక్‌ దర్శనానికి ‘శ్రీవాణి’ 
భక్తులు, దళారులను ఆశ్రయించకుండా ఉండేందు కు శ్రీవాణి పథకంపై భక్తులకు అవగాహన కల్పించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా అందజేసిన భక్తులు వీఐపీ బ్రేక్‌ దర్శనభాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండానే వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనం లభిస్తుండడంతో భక్తులు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా టీటీడీ పథకానికే డబ్బు చెల్లించవచ్చు. దీంతో స్వామివారికి కానుక సమర్పించామన్న తృప్తి మిగులుతుండడంతో భక్తు లు ఈ పథకంపై మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ఈ పథకానికి వస్త్ను్న విరాళాలే నిదర్శనంగా చెప్పవచ్చు. 10 రోజుల్లో 533 మంది భక్తులు శ్రీవాణి పథకానికి విరాళాలు అందించగా, గత శుక్రవారం ఏకంగా 153 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందజేశారు. దీంతో దళారులను భక్తులు ఆశ్రయించకూండా ప్రత్యామ్నాయ మార్గంగా శ్రీవాణి ట్రస్టును వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఇలా దళారీ వ్యవస్థను అరికట్టేందుకు అన్ని వైపుల టీటీడీ చర్యలు తీసుకుంటోంది.  

ఇంటి దొంగల గుట్టు రట్టు 
ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరన్న సామెత నిజం కాదన్న విషయాన్ని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు రుజువు చేస్తున్నారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో విధుల్లో ఉన్న మధుసూదన్‌ అనే వ్యక్తి భక్తులకు సులభ దర్శనం చేయిస్తానని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఘటన వెలుగు చూడగా... అతన్ని విచారించగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. రోజుకి 25 మంది భక్తుల వరకు టీటీడీ ఉద్యోగి మధుసూదన్‌ దర్శనా లు చేయిస్తున్నాడు. ఇక ఫోన్‌ పే ద్వారా 300 ట్రాన్‌సెక్షన్లు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఇంత స్థాయిలో అక్రమాలకు పాల్పడిన దళారీ ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.  

దళారీ వ్యవస్థను మట్టి కరిపిస్తాం 
తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిస్థాయి లో అణచివేస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనా న్ని సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చి, లంచగొండితనం అరికట్టే వి«ధంగా చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్‌ పూర్తిస్థాయి సహాయ సహాకారాలతో ఇప్పటికే పూర్తిస్థాయిలో దళారీ వ్యవస్థను నాశనం చేశాం. శ్రీవాణి ట్రస్టుతో దళారీ అనే పదం ఉండకుండా చేశాం.
– టీటీడీ అడిషనల్‌ ఈఓ ఏవీ ధర్మారెడ్డి     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top