భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.
కరీంనగర్: భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రెండు మూడు నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పంటలకు నష్టం కలిగించే కోతుల బెడద నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమే సంబరాలు జరుపుకుంటోందని విమర్శించారు. వందలాది మంది ఆత్మ బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని మరిచి సంబరాలు చేసుకోవడం విడ్డూరమన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను నమ్మకం కల్గించే విధంగా లేవని పేర్కొన్నారు.