
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం చంద్రబాబుకి లేఖ రాశారు. ‘ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో కన్నీరు కార్చింది నిజమా? లేక నటనా?. ఒకవేళ నిజమే అయితే రాజధాని పేరుతో మూడు పంటలు పండే భూములను తీసుకుని వ్యాపారం చేసినప్పుడు రైతుల కన్నీరు కనిపించలేదా.. ఇచ్చిన హామీలను అమలు చేయమని రోడ్డెక్కిన మా జాతిని ఈడ్చి కొట్టినపుడు మా కన్నీరు కనిపించలేదా.
మీ ఆర్భాటం కోసం గోదావరి పుష్కరాల్లో 30 మంది భక్తులను చంపి వారి కుటుంబాల కన్నీటిని గోదారిలో కలిపేశారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మేధావినని డబ్బాలు వాయించడం మానండి. మీ నటన, అబద్ధాలు ప్రజలు చూడలేకపోతున్నారు. ప్రజలను ఎలా గౌరవించాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని స్పూర్తి పొందండి’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.