
బాక్సైట్‌పై పోరు
బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం మన్యంలో ఊపందుకుంది...
- ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలో ధర్నా, ర్యాలీలు
- అఖిలపక్షం ఆధ్వర్యంలో అంతటా ఆందోళనలు
- టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
- పోలీసుల అదుపులో బూదరాళ్ల సర్పంచ్
పాడేరు: బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం మన్యంలో ఊపందుకుంది. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా గిరిజనులు ఏజెన్సీలోని అన్ని మండలాల్లో బుధవారం ర్యాలీ, ధర్నాలు చేపట్టారు. పచ్చని మన్యంలో బాక్సైట్ చిచ్చు పెట్టొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అఖిలపక్షాలు విజ్ఞప్తి చేశాయి. తక్షణం ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. పాడేరులో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి ఇంటి ముందు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, వైస్ ఎంపీపీ మాదెల బొజ్జమ్మ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అలాగే కిండంగిలోని బొర్రా నాగరాజు, బొర్రా విజయరాణి, కాంప్లెక్స్ రోడ్డులోని రొబ్బి రాము, కొట్టగుల్లి సుబ్బారావు షాపింగ్ కాంప్లెక్స్ ముందు, కొత్తపాడేరులో బీజేపీ నాయకుడు కురుసా బొజ్జయ్య ఇళ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. అరకులోయలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఇంటిని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ముట్టడించారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు క్యాంప్ కార్యాలయం నుంచి సీవేరి సోమ ఇంటి వరకు నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.పాడేరులోని ఆందోళనలో మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలను సమిష్టిగా అడ్డుకుందామని పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ నాయకురాలు లకే రత్నాభాయి మాట్లాడుతూ ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే తవ్వకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పాడేరు పట్టణంలో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. ఎంపీటీసీలు కిల్లు చంద్రమోహన్ కుమార్, అడపా నర్సింహనాయుడు, సాగిన బాబూరావు పడాల్, వారం చిట్టిబాబు నాయుడు, ఏపీటీఎఫ్ నాయకులు పి.గోవిందరావు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గంగపూజారి శివ, నవరాజు పాల్గొన్నారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు: కొయ్యూరు: బాక్సైట్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆందోళనను తెలుసుకున్న పోలీసులు టీడీపీ నాయకుడు ఎంవీవీఎస్ ప్రసాద్ ఇంటి వద్ద నిఘా పెట్టారు. బూదరాళ్ల పంచాయతీ నుంచి వచ్చే గిరిజనులను అడ్డుకున్నారు. సర్పంచ్ సూరిబాబును సీఐ సోమశేఖర్ మంగళవారమే అదుపులోకి తీసుకుని కేడిపేట స్టేషన్‌లో ఉంచారు. ఆందోళనలు వద్దంటూ ఏపీ పోలీసు చట్టం 1861లో 30(ఏ) కింద సీపీఐ నేతలు బి. రామరాజ్యం, చిన్నారావు, శివరామరాజులకు నోటీసులు ఇచ్చారు. ఏఎస్పీ అనుమతి లేకుండా ఎవరూ ర్యాలీలు చేపట్టరాదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు ర్యాలీకి వచ్చేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు.