పత్తాలేని మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌

Merain Police Station File Pending In West Godavari - Sakshi

తీరంలో కొరవడిన రక్షణ

ముందుకు కదలని ఫైల్‌

పట్టించుకోని పాలకులు

పశ్చిమగోదావరి, నరసాపురం: జిల్లాలోని తీర ప్రాంతంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు అంశం పత్తా లేకుండా పోయింది. నరసాపురం తీరంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుపై కొన్ని సంవత్సరాల నుంచి హడావిడి జరుగుతుంది. మళ్లీ విషయం మరుగున పడిపోవడం పరిపాటిగా మారింది. ఆరేడేళ్లుగా ఇదే తంతు. అయితే కొంతకాలం క్రితం అంతర్వేదిలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడంతో ఇక ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు ఉండవని భావించారు. అయితే జిల్లాలో తీరప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉండటంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. త్వరలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు అంటూ రెండేళ్ల నుంచి హడావిడి జరుగుతుంది. కచ్చితంగా ఇక్కడ మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు జరుగుతుందని అటు పోలీస్, ఇటు రెవెన్యూశాఖలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ముంబైలో సముద్ర మార్గం ద్వారా కసబ్‌తో సహా పలువురు తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. సరిగ్గా అప్పుడే కేంద్రం మన రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో రక్షణ చర్యలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా నరసాపురం తీరప్రాంతంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన చేశారు.

అనుకున్నది ఇక్కడ.. అయ్యింది అక్కడ
నరసాపురంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు 2012లో దాదాపుగా రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడిన ప్రతినిధి బృందం నరసాపురం తీరగ్రామాల్లో పర్యటించింది. నరసాపురం మండలం చినమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెం ప్రాంతాలు పరిశీలించారు. చినమైనవానిలంకలో ఓ ప్రాంతాన్ని స్టేషన్‌ ఏర్పాటుకు అనువుగా గుర్తించారు. ముందుగా మన జిల్లాలోని తీరప్రాంతంలోనే మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా ముందు ప్రతిపాదనలో లేని  తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మాత్రం 2013లోనే  మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసేశారు. ఇక్కడ మాత్రం అప్పటినుంచి  పెండింగ్‌ పెట్టారు. తరువాత కాలంలో రాష్ట్ర విభజన జరగడంతో ఇక మొత్తం ఈ అంశం తెరవెనక్కు వెళ్లింది.

ఎన్నో ఉపయోగాలు
జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. తరచూ ప్రకృతి విపత్తులకు గురి కావడం వంటి ఇబ్బందుల రీత్యా ఇక్కడ మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ అత్యంత అవసరమని గతంలో జరిగిన సర్వేలు నిర్ధారించాయి. మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ అందుబాటులో ఉంటే కేవలం తీరప్రాంత భద్రత, రక్షణ అనే కాకుండా ఇతర   ఉపయోగాలుంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం, వారికి ప్రాణహాని కలగకుండా రక్షించడం మెరైన్‌ స్టేషన్‌ సిబ్బంది చేస్తుంటారు. బోట్లు, విపత్తు రక్షణ సామాగ్రి వారి వద్ద అందుబాటులో ఉండటం ఉపయోగంగా ఉంటుంది. సునామీ సమయంలోనూ, ప్రకృతి విపత్తుల సమయంలో జరిగిన ప్రమాదాల్లో అనేకమంది ఈ ప్రాంతంలో  ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ అవసరాన్ని గుర్తించిన జిల్లా పోలీస్‌శాఖ అనేకసార్లు మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ అంశాన్ని కేంద్రం దృష్టిలో పెట్టింది. ఇంతకుముందు ఎస్పీగా పనిచేసిన భాస్కర్‌భూషణ్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన కూడా స్థల పరిశీలన చేసి వెళ్లారు. అయితే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పనిమాత్రం జరగడంలేదు.

స్థలం అందుబాటులో ఉంది
తీరంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థల సమస్య అయితే లేదు. స్థలం కావాలంటే సేకరించి ఇవ్వొచ్చు. గతంలో గుర్తించామని చెబు తున్న చినమైనవానిలంకలో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రతిపాదన వస్తే మాత్రం భూమి సేకరించి ఇస్తాం. చినలంకలో కాకపోయినా ఇంకెక్కడైనా ఇవ్వవచ్చు.– జి.సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top