పైరవీల కొలువు


వైద్య శాఖ ఉద్యోగాల్లో అధికార పార్టీదే హవా...

కలెక్టర్‌ ఆదేశాలను తప్పుదారిపట్టిస్తున్న నేతలు

ఒత్తిళ్లకు తలొగ్గి అర్హులను పక్కన పెట్టిన యంత్రాంగం

అనర్హుల కోసం చేతుల మారిన కాసులు




సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఏదైనా శాఖ ద్వారా పనులొస్తే తమవారికే అప్పగించాలి. పోస్టుల్లోనూ తమవారినే నియమించాలి. పథకాలు ఏవైనా వస్తే తాము చెప్పినవారికే మంజూరు చేయాలి. ఇదీ ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ సాగిస్తున్న దందా... వారి పైరవీల వల్ల నిజమైన అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందనడానికి కిల్లాడ అనూరాధ ఉదంతం ఒకఉదాహరణ మాత్రమే. వెలుగులోకి రానివెన్నో ఇలాంటివి ఉన్నాయి.



అసలేమైందంటే...

ఐటీడీఏ పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖలో 6 స్టాప్‌నర్సు, 6 ఏఎన్‌ఎం, నాలుగు ఫార్మసిస్టు, పార్వతీపురంలోని సీమాంక్‌ సెంటర్‌లో 2 స్టాఫ్‌ నర్సు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 12న స్క్రూట్నీ, 13న మెరిట్‌ లిస్టు ప్రకటిస్తామని చెప్పారు. 14న గ్రీవెన్స్‌ సెల్‌ అదే రోజున ఫైనల్‌ మెరిట్‌ లిస్టు ప్రకటించి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తామని నోటిఫికేషన్‌లో వివరించారు. కానీ ఈ నెల 14న ఓసారి, 16న మరోసారి అభ్యర్థులు వెళ్లినా అక్కడ మెరిట్‌ లిస్టు పెట్టలేదు. రోజు లు గడుస్తున్నా తమకు సమాచారం అందకపోవడంతో ఈ నెల 24న డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా పోస్టులు భర్తీ చేసేశామని చెప్పారు. మెరిట్‌లో ముందున్న వారు విషయం తెలిసి అవాక్కయ్యారు. కార్యాలయ సిబ్బందిని అడిగితే దరఖాస్తులందిన తరువాత ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్చి అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పుకొచ్చారు.



పైరవీలకే పెద్దపీట

జిల్లాలోని ఏజెన్సీలో పనిచేసేందుకు భర్తీ చేస్తున్న వైద్య శాఖ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చినా పలువురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల సూచనలు, సిఫార్సు లేఖలతోనే ఈ పోస్టుల ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నా వారికి అందకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులు, కార్యకర్తలు సూచించిన వారికే పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు దరఖాస్తు చేసుకునే ఈ పోస్టులపై కన్నేసి తమ అనుయాయులకు కట్టబెట్టుకున్న నాయకులు వైద్యుల పోస్టుల భర్తీకి మాత్రం కృషి చేయలేకపోవడం విచారకరం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top