మండలంలోని చిన్నమేడారం.. జాతరకు సిద్ధమైంది. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరకు కుర్రారం, బూర్గుపల్లి గ్రామాల మధ్య కొలువై ఉన్న సమ్మక్క- సారలమ్మల గద్దెల వద్ద మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహించేందుకు జిల్లాలోని చిన్న మేడారాలు ముస్తాబయ్యాయి. పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం, పెద్దవూర మండలంలోని నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారి పక్కనున్న పొట్టిచెల్మ క్రాస్‌రోడ్డు వద్ద, రాజాపేట మండలం చిన్న మేడారం వద్ద బుధవారం నుంచి 15వరకు నిర్వహించే జాతరకు నిర్వాహకులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు రంగులు వేసి రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
- న్యూస్‌లైన్, రాజాపేట/పెన్‌పహాడ్/పెద్దవూర
చిన్నమేడారం(రాజాపేట), న్యూస్‌లైన్: మండలంలోని చిన్నమేడారం.. జాతరకు సిద్ధమైంది. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరకు కుర్రారం, బూర్గుపల్లి గ్రామాల మధ్య కొలువై ఉన్న సమ్మక్క- సారలమ్మల గద్దెల వద్ద మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. మంచినీరు, వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఇక్కడ బొమ్మలు, కొబ్బరి కాయలు, బెల్లం, ప్రసాద విక్రయాల దుకాణాలు, హోటళ్లు వెలిశాయి.
1994లో..
రాజాపేట మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు బూర్గుపల్లి, కుర్రారం గ్రామాల మధ్య 1994లో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క- సారలమ్మలను వరంగల్ జిల్లా మేడారం ప్రధాన పూజారి కోయ లక్ష్మయ్య చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేశారు. రానురాను ఈ జాతర చిన్నమేడారంగా పేరుగాంచింది. ఇక్కడి ఆలయం దాతల సాయంతో దినదినాభివృద్ధి చెందుతోంది.
గద్దెల వద్ద మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్ మంచినీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. జనగామకు చెందిన మహంకాళి రాజేశ్వర్.. సమ్మక్క సారలమ్మల గద్దెలకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్ ఆలయ ప్రాంగణంలో మట్టిరోడ్డు వేయించారు. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ సీసీరోడ్డు నిర్మాణం చేయించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీధిదీపాలు ఏర్పాటు చేయించారు.
పుణ్యక్షేత్రాల దర్శనం ఇలా..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 20 కిలోమీటర్ల దూరంలోగల రాజాపేట మండలంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, పురాతన కట్టడాలున్నాయి.
రాజాపేటలో రాచరికపాలనకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గడికోట ఉంది. ఈ కోటలో అంతఃపురం, కారాగారాలు, సైనికుల స్థావరం, దృఢమైన దరువాజలు ఉన్నాయి
కుర్రారంలో బసవేశ్వర త్రికూటాలయం ఉంది కుర్రారం గ్రామానికి 16 కిలోమీటర్ల దూరంలోని చేర్యాల మండలంలో కొండపోచమ్మ, కొమురవెళ్లి దేవాలయాలు ఉన్నాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
భక్తులకు ఎలాంటి అ సౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. తాగునీటి కో సం ట్యాంకర్లు ఏర్పా టు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. వీధి దీపాలు కూడా ఏర్పాటు చేశాం.
- చిలుకూరు శ్రీనివాస్, ఎంపీడీవో రాజాపేట
ఘనంగా ఎల్లమ్మకు బోనాలు
రాజాపేట మండంలోని చిన్నమేడారంలో మంగళవారం రాత్రి సంప్రదాయ బద్ధంగా ఎల్లమ్మల బోనాలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న సమ్మక్క, సారలమ్మల జాతరలో భాగంగా కుర్రారం, బూర్గుపల్లి గ్రామాల మహిళలు వేర్వేరుగా పెద్ద ఎత్తున బోనాలతో చిన్న మేడారం వద్దకు చేరుకున్నారు. ఎల్లమ్మ గద్దెచుట్టూ తిరిగి బోనాలు సమర్పించి పూజలు చేశారు. బోనాల కార్యక్రమాన్ని ఎంపీడీవో చిలుకూరు శ్రీనివాస్, ఎస్‌ఐ నర్సింహనాయక్, సర్పంచ్‌లు రేకులపల్లి మహిపాల్‌రెడ్డి, పాండవుల కనకలక్ష్మిలు ప్రారంభించారు. నేడు ఏదులగుట్ట నుంచి సారలమ్మ గద్దె ఎక్కుతుందని నిర్వాహకులు తెలిపారు.
రెండో సమ్మక్క- సారలమ్మలుగా..
పెన్‌పహాడ్ : మండలంలోని గాజులమల్కాపురం శివారులో సర్కదన బోడు వద్ద పన్నెండేళ్ల క్రితం సమ్మక్క, సారలమ్మ దేవతామూర్తులు వెలిశారు. నాటి నుంచి జిల్లాలోనే రెండో సమ్మక్క, సారలమ్మలుగా వెలుగొందుతున్నారు. బుధవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జాతర జరగనుంది. గ్రామానికి చెందిన బాదరబోయిన సోమయ్య మొక్కు లు చెల్లించేందుకు వరంగల్ జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లివస్తుండగా దేవతామూర్తులు కలలో ప్రత్యక్షమై సర్కదన బోడు వద్ద విగ్రహాలు ప్రతిష్ఠించాలని కోరడంతో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశా రు. ఈ జాతరకు సూర్యాపేట నుంచి గాజులమల్కాపురం వరకు ఆర్టీసీవారు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
పొట్టిచెల్మ క్రాస్‌రోడ్డు వద్ద..
పెద్దవూర : మండలంలోని నాగార్జునసాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై గల పొట్టిచెల్మ క్రాస్ రోడ్డు వద్ద చిన్న మేడారంగా విరాజిల్లుతున్న సమ్మక్క , సారలమ్మల జాతర బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ పూజారులు గుంజ అంజమ్మ, గుంజ కృష్ణంరాజు తెలిపారు. పొట్టిచెల్మ వద్ద 14ఏళ్ల క్రితం సమ్మక్క, సారలమ్మల విగ్రహాలను ప్రతిష్ఠిచారు. అయితే ఏడేళ్ల నుంచి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు.
కలలోకి వచ్చి చెప్పడంతో..
ప్రతి సంవత్సరం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి వచ్చేవారమని పూజారి అంజమ్మ తెలిపారు. క్రమేణా కులదేవతలుగా పూజించేవారమన్నారు. ఈ క్రమంలో తన కుమార్తె లక్ష్మికి దేవతామూర్తులు కలలో వచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించి జాతర నిర్వహించాలని చెప్పినట్లు ఆమె తెలిపారు. దీంతో మిర్యాలగూడ, అనుముల మండలం తిరుమలగిరిలోని స్వగృహంలోనూ, పైలాన్‌లోనూ, శ్రీశైలం అడవుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసినా దేవతామూర్తులు కరుణించలేదన్నారు. నాగార్జునసాగర్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున అటవీ ప్రాంతంలో ప్రతిష్ఠిం చాలని మళ్లీ కలలోకి వచ్చి చెప్పారన్నారు. దీంతో నాగార్జునసాగర్-హైదరాబాద్, మిర్యాలగూడెం ప్రధాన రహదారి కూడలిలో పొట్టిచల్మ వద్ద సమ్మక్క-సార లమ్మ దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ జాతరకు మిర్యాలగూడెం, దేవరకొండ, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహిస్తుంటారు.