15 ఏళ్లుగా బతుకులు బందీ!

Mangalagiri LB Nagar Residents Trouble With Iron Fencing - Sakshi

రోజూ ఇంట్లోకి వెళ్లి రావాలంటే నరకయాతన ఓ వైపు గోడ.. మరోవైపు కంచె రాకపోకలకు అడ్డంగా తిరిగి నడవాల్సిందే

ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గాయాలే

ఏపీఎస్పీ అధికారుల తీరుతో మంగళగిరి ఎల్‌బీ నగర్‌ వాసుల కష్టాలు

ముఖ్యమంత్రిని కలిసినా ఉపయోగం లేని వైనం

సాక్షి, మంగళగిరి: వారు చేయని నేరానికి గత 15 ఏళ్లుగా ఇనుప కంచె మధ్య బందీలయ్యారు. అందరి మధ్య ఉంటూనే ప్రభుత్వాధికారుల మధ్య సమన్వయలోపంతో నిర్బంధ జీవితం గడుపుతున్నారు. ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా నానా అగచాట్లు పడాల్సిందే. ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్లాలంటే అదో ప్రహసనమే. ఎవరైనా చనిపోతే వారి పాట్లు చెప్పనలవి కాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇనుపకంచె ఒంటిపై చేసే గాయాలతో విలవిల్లాడాల్సిందే.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎల్‌బీ నగర్‌లో ఏపీఎస్పీ క్యాంపు రోడ్డును ఆనుకుని 1972లో సుమారు 50 కుటుంబాల వారు స్థిర నివాసాలు ఏర్పర్చుకుని ఉంటున్నారు. మున్సిపల్‌ అధికారులు క్యాంపు రోడ్డును సరిహద్దుగా పరిగణనలోకి తీసుకుని వీరికి ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. అందరూ పక్కా భవనాలు నిర్మించుకున్నారు. ఇంతలో 2003లో ఏపీఎస్పీ బెటాలియన్‌ అధికారులు తీసుకున్న నిర్ణయం వారిని నిశ్చేష్టుల్ని చేసింది. క్యాంపు ఆవరణ చుట్టూ కంచె వేసిన అధికారులు క్యాంపు రోడ్‌ను ఆనుకుని వున్న ఇళ్లకు రోడ్డు మార్గం లేదంటూ వారి నివాసాల గేట్ల ముందు నుంచి కూడా కంచె వేసేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు కనీసం గేటు తెరిచే ఖాళీ లేకుండా కంచె వేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి.

సొంత నివాసాలు కావడంతో ఖాళీచేసి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఇంట్లో మనిషి చనిపోతే శవాన్ని తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సిందే. తమకు దారి కల్పించమని కోరుతూ పదిహేనేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే కంచెను మార్పించి తమకు దారి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఒకసారి అప్పటి తహసీల్దార్‌ శేషగిరిరావు, ఆర్డీవో నాగబాబు స్వయంగా సందర్శించి వారి కష్టాలు చూసి సర్వే నిర్వహించి వారికి దారి ఇవ్వాల్సిందేనని కలెక్టర్‌కు నివేదించినా ఉపయోగం లేకుండాపోయింది. చివరికి ఏడాది క్రితం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయగా, సర్వేయర్‌ను పంపి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అయినా, ఇప్పటివరకు సర్వే నిర్వహించిన దాఖలాల్లేవు. మున్సిపల్, రెవెన్యూ, ఏపీఎస్పీ అధికారులు తక్షణం జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.  

కంచె వేయడం దుర్మార్గం
2003లో ఏపీఎస్పీ అధికారులు రోడ్డు వదలకుండా కంచె వేయడం దుర్మార్గం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా, రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇనుప కంచె గీసుకుని గాయాలపాలవుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును మినహాయించి కంచె వేయాలి.
– టి సుదర్శనరావు, రిటైర్డు ఏఎస్‌ఐ

దారి కల్పించి కష్టాల నుంచి కాపాడాలి
క్యాంపు రోడ్డు ఉందనే ఇళ్లు కట్టుకున్నాం. బిందెడు నీళ్లు ఇంట్లోకి తెచ్చుకునేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. గోడకు కంచెకు మధ్యలో అడ్డం తిరిగి నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇళ్లల్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా పాట్లే. అధికారులు వెంటనే కల్పించుకుని ఈ కష్టాల నుంచి కాపాడాలి.
– సీహెచ్‌ సువర్ణ, స్థానికురాలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top