సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 50 రోజులైన నేపథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బుధవారం 36 కిలో మీటర్ల మేర కడప ఔటర్ రింగురోడ్డు చుట్టూ ఏర్పాటుచేసిన మహా మానవహార కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 50 రోజులైన నేపథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బుధవారం 36 కిలో మీటర్ల మేర కడప ఔటర్ రింగురోడ్డు చుట్టూ ఏర్పాటుచేసిన మహా మానవహార కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వెల్లువెత్తింది. కడప నగరం నుంచే కాకుండా చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, సిద్ధవటం మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
యోగి వేమన విశ్వవిద్యాలయ విద్యార్థులతోపాటు వివిధ ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఈడీ తదితర వృత్తి విద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా కడప నగరంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి కదనోత్సాహంతో పాల్గొనడం విశేషం. ఎక్కడ చూసినా చిన్నారుల సందడే కనిపించింది. భారతమాత, తెలుగు తల్లి, అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు తదితర వేషధారణలతో ఆకట్టుకున్నారు. సమైక్యాంధ్ర జెండాలు చేతబూని నినాదాలతో సందడి చేశారు.
మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయులు, ఎన్‌జీఓలు, ఆర్టీసీ కార్మికులు గెజిటెడ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, వివిధ మతాలకు చెందిన పెద్దలు తమకు కేటాయించిన ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు. రింగురోడ్డును ఐదు జోన్లుగా విభజించారు. జేఎంజే కళాశాల నుంచి మొదలుపెడితే రాయచోటి రోడ్డు, పులివెందుల రోడ్డు, ఆలంఖాన్‌పల్లె ఇర్కాన్ సర్కిల్, తిరుపతి రోడ్డు, జెఎంజె కళాశాల వరకు మహా మానవహారాన్ని నిర్వహించారు. దీంతో చిత్తూరు- కర్నూలు 18వ జాతీయ రహదారి, కడప- తిరుపతి, పులివెందుల, తాడిపత్రి ఎక్స్‌ప్రెస్ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సివచ్చింది.
రెఫరెండం జరపాలి- ఏజేసీ :
రాష్ట్రాన్ని విభజించాలా, వద్దా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తొలుత రెఫరెండం నిర్వహించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛెర్మైన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన మానవహారం కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెఫరెండం నిర్వహిస్తే అత్యధిక శాతం ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటారన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య పద్ధతి అని పేర్కొన్నారు. ప్రజాస్పందనను చూసైనా విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన రాజకీయ పార్టీలు వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. చేసిన తప్పిదాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలన్నారు. సమైక్యాంధ్ర కోసం 50 రోజులుగా ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో సైతం కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయని, కానీ సమైక్య ఉద్యమంలో మాత్రం స్వల్ప సంఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు.
ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పేదలకు అందడం లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టం కంటే ఇది చాలా స్వల్పమేనని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎస్మా, ఇతర నిర్బంధాలు ప్రయోగించాలని చూస్తున్నప్పటికీ జనం స్వచ్ఛందంగా ఉద్యమంలోకి తరలివస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించినందువల్లే ప్రజలు ఎక్కడికక్కడ నినదిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం.. డీఆర్‌ఓ
సమైక్యాంధ్రను సాధించడం కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా ఉద్యమాలు నిర్వహిస్తామని డీఆర్‌ఓ ఈశ్వరయ్య అన్నారు. యాభై రోజులుగా వివిధ వర్గాల ప్రజలు మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించే వరకు పోరుబాట వీడబోమన్నారు. ప్రభుత్వంలో చలనం కలిగించడానికి వివిధ రకాల ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
ప్రకటన వెలువడేవరకు ఉద్యమం. ఆర్డీఓ:
సమైక్యాంధ్రప్రదేశ్ ప్రకటన వెలువడేవరకు ఉద్యమం ఆగబోదని కడప ఆర్డీఓ వీరబ్రహ్మయ్య అన్నారు. చిన్నపిల్లల మొదలు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి తరలివస్తున్నారన్నారు. ప్రజా స్పందనను చూసైనా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తెలుగుజాతిని రెండుగా చీల్చే విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
సోనియా స్పందించాలి.. జెడ్పీ సీఈఓ :
సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని చూసైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించాలని జెడ్పీ సీఈఓ మాల్యాద్రి కోరారు. నాయకులెవరూ లేకుండానే లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని, బహుషా జాతీయోద్యమ కాలంలో కూడా ఇలా జరిగి ఉండదన్నారు.
హైదరాబాద్‌తోనే భవిష్యత్తు.. డీఈఓ :
హైదరాబాద్ లేకపోతే సీమాంధ్రుల భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య అన్నారు. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఫార్మా, రంగాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాజధానిని దూరం చేస్తే ఈ ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
ఉద్యోగులను నిందించడం తగదు.. ఎన్‌జీఓ అధ్యక్షుడు
ప్రజాప్రతినిధులను ఎవరో కొందరు గట్టిగా నిలదీశారని, ఆ నేరాన్ని ఉద్యోగులపై మోపడం రాజకీయ నాయకులకు తగదని జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. రాజీనామాలు చేయాలంటూ తమను ఎవరూ కోరలేదని ప్రజాప్రతినిధులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఉద్యమాన్ని మరింత వేడెక్కించేందుకు ఈనెల 19, 20 తేదీలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామన్నారు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తామన్నారు. అలాగే 24వ తేదీ 13 జిల్లాల్లో రహదారుల దిగ్బంధనం జరుగుతుందన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను దిగ్బంధిస్తామన్నారు.
ఈ నెల 30న ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటసుబ్బయ్య, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తి నాయుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఉపాధ్యాయ విభాగం కన్వీనర్ జివి నారాయణరెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎస్‌విబి రాజేంద్రప్రసాద్, నాగముని, జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షుడు ఎం.వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.