మాగుంట సంచలనం

Magunta Srinivasareddy Created History In Ongole Parliament Election - Sakshi

సాక్షి, ఒంగోలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంచలనం సృష్టించారు. ఒంగోలు పార్లమెంట్‌లో 48 ఏళ్ల క్రితం నమోదైన భారీ మెజార్టీ రికార్డును బ్రేక్‌ చేశారు. 1952లో ఒంగోలు పార్లమెంట్‌ ఏర్పడగా, 1971లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసిన అంకినీడు ప్రసాదరావు తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి గోగినేని భారతీదేవిపై రికార్డు స్థాయిలో 1,79,894 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రికార్డును బ్రేక్‌ చేసిన వారు లేరు. అనంతరం 1980లో పులివెంకటరెడ్డి 1,51,175 ఓట్ల మెజార్టీ వద్ద ఆగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం 2019 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో రాత్రి 11.47 గంటల సమయానికి తన సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కంటే 2,12,522 ఓట్ల ఆధిక్యంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి ముందంజలో ఉన్నారు. 1971లో అంకినీడు ప్రసాదరావు నెలకొల్పిన రికార్డును మాగుంట బ్రేక్‌ చేయడం ఖాయమని తెలుస్తోంది.
మాగుంట శ్రీనివాసులరెడ్డి 1998లో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఓటమిపాలైనప్పటికీ 2004 ఎన్నికల్లో 1,06,021 ఓట్ల మెజార్టీతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009 ఎన్నికల్లోనూ 78,523 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి మారి ఎంపీగా పోటీచేయగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డిపై 15,658 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తాజాగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీచేసి ఒంగోలు పార్లమెంట్‌ చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top