సీఎఫ్‌ఎంఎస్‌ పనితీరు ఇలాగేనా?

LV Subrahmanyam Comments On CFMS - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అసంతృప్తి

సమస్యలుంటే వెంటనే పరిష్కరించండి

ప్రాధాన్యతా క్రమం పాటించకుండా బిల్లులు చెల్లిస్తారా?

ఉద్యోగుల వేతనాలు, అత్యవసర బిల్లులు త్వరగా చెల్లించండి

ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతోపాటు ఉద్యోగులకు వేతనాలు ఇంకా అందలేదని ఫిర్యాదులు రావడంతో వారం రోజుల వ్యవధిలోనే సీఎస్‌ రెండోసారి మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించడం, తరుచూ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లడంపై సీఎస్‌ ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లడం తదితర అంశాలపై సమీక్షించారు. తరుచూ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బిల్లుల చెల్లింపులో వివక్ష వద్దు
తొలుత ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని, అలాగే రీపేమెంట్లు సకాలంలో చేయాలని సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 22వ తేదీ నాటికి రూ.17,413 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్‌ పేర్కొన్నారు. అత్యవసర బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలోనే  బిల్లులు చెల్లించాలని, ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపరాదని తేల్చిచెప్పారు. సీఎఫ్‌ఎంఎస్‌ సమస్య వల్ల బిల్లులు అందడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పనితీరు ఇలాగేనా?     అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top