నాలుగేళ్లుగా నలుగురే దిక్కు

Low Staff In Power transfer Department In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో ముఖ్యమైన మరమ్మతులు, నిర్వహణ విభాగం కేవలం నలుగురు సిబ్బందితోనే పని చేస్తోంది. ఆ నలుగురిలోనూ ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఉండడం గమనార్హం. అసలే వర్షాకాలం.. తుపానులొస్తున్నాయి.. వరదలు చుట్టుముడుతున్నాయి.. ఈదురు గాలులు విరుచుకుపడుతున్నాయి. ఏ క్షణంలో ఏ అవసరమొస్తుందో తెలియదు.. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వాటిని బాగుచేయడానికి ఆ నలుగురే దిక్కు.  జిల్లా చూస్తే పెద్ద విస్తీర్ణంలోఉంది.. ఏ మూలకు వెళ్లాలన్నా జిల్లా కేంద్రం నుంచి సుమారు 4 గంటల సమయం పడుతోంది. అక్కడికివెళ్లిన తరువాత మరమ్మతులకు మరింత సమయం పడుతోంది. ఈ లోపు ఇతర ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్‌ పునరుద్ధరిస్తున్నా అది కూడా ట్రిప్‌ అయితే ఒక రోజంతా వినియోగదారులు చీకటిలో మగ్గిపోవాల్సి వస్తోంది.

2014లో 10 మంది.. ఇప్పుడు నలుగురే
2014– 15 సంవత్సరంలో ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో సుమారు 170 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉండగా వాటి నిర్వహణకు ఏలూరులోని ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ – మరమ్మతుల విభాగ కార్యాలయంలో 10 మంది సిబ్బంది అందుబాటులో ఉండే వారు. వివిధ కారణాల వల్ల ప్ర స్తుతం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. కానీ విద్యుత్‌ సర్వీసులు పెరిగిన నేపథ్యంలో వాటి సేవకుగాను ప్రస్తుతం ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్లో 255 విద్యుత్‌ ఉప కేంద్రాలు, 420 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తక్కువ సబ్‌ స్టేషన్లు ఉన్న సమయంలో 10 మంది సిబ్బంది ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్లు పెరిగిన అనంతరం సిబ్బంది తగ్గిపోవడంతో వాటి నిర్వహణ భారమంతా ఆ నలుగురిపైనే పడుతోంది. 

ఇరత చోట్ల పూర్తి సిబ్బంది
ఈ కంపెనీ పరిధిలోని రాజమండ్రి సర్కిల్‌లో 166 ఉపకేంద్రాలు, 264 ట్రాన్స్‌ఫార్మర్లకు 9 మంది సిబ్బంది ఉండగా, విశాఖపట్టణం సర్కిల్‌లో 160 ఉపకేంద్రాలు, 266 ట్రాన్స్‌ఫార్మర్లకు 14 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలాగే విజయనగరం సర్కిల్‌ పరిధిలో 87 ఉప కేంద్రాలు, 109 ట్రాన్స్‌ఫార్మర్లు, 7గురు సిబ్బంది, శ్రీకాకుళం సర్కిల్‌లో 90 ఉప కేంద్రాలు, 110 ట్రాన్స్‌ఫార్మర్లు 11 మంది సిబ్బంది ఉన్నారు. అంటే ఇతర సర్కిళ్లలో సబ్‌ స్టేషన్లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తక్కువగా ఉన్నా అక్కడ సిబ్బంది అధికంగానే ఉండగా, కేవలం ఏలూరు సర్కిల్‌లో మాత్రమే సిబ్బంది కొరత ఉండడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. 

ఎవరికీ పట్టని సిబ్బంది ఆందోళన
ఈ కార్యాలయంలో ఉన్న నలుగురు సిబ్బంది ఇన్ని సబ్‌స్టేషన్లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు, నిర్వహణ చేయాల్సి రావడంతో వారికి పనిభారం విపరీతంగా పెరిగింది. ఒక్కొక్కరూ సుమారు 18 గంటలు పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో ఇక్కడ సిబ్బందిని పెంచాలని, మారుమూల ప్రాంతాలకు వేగవంతంగా చేరుకోవడానికి మంచి వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అనేక సార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా వీరి మొరను ఆలకించే తీరిక అధికారులకు ఉండడం లేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది మాత్రం నాలుగేళ్లుగా తమకు వీలు కలిగినప్పుడల్లా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసన తెలియజేస్తున్నారు. అయినా అధికారులు ఈ కార్యాలయ సిబ్బందిని పెంచే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

మరో సెక్షన్‌ మంజూరు చేయాలి
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏలూరు సర్కిల్‌లో ప్రజలకు అంతరాయంలేని విద్యుత్‌ అందించాలంటే మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి మరో సెక్షన్‌ కార్యాలయాన్ని మంజూరు చేయాలి. దానికి తగ్గట్టు సిబ్బందిని కూడాపెంచాలి. ఒక్క పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా ఒక మండలం మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే ప్రమాదముంది. 
దాసి ఆనంద కుమార్, సబ్‌ ఇంజినీర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top