‘కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధం’

Lakshmana Reddy Praises CM Jagan Decesion On Corona - Sakshi

సాక్షి, గుంటూరు : పేదల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈమేరకు గురువారం లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలిపారు. కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధమైందని, వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమన్నారు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరుపున జీవో 77 విడుదలైందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో ప్రజలకు ఉపశమనం ఖాయమని తెలియజేశారు. (కరోనా టెస్టుల్లో దూసుకుపోతున్న ఏపీ..)

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారని.. తాజాగా ఆయా ఆసుపత్రుల వర్గీకరణ, వైద్యానికి ధరలు నిర్ణయించడంతో మార్గం సుగమం అయిందన్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా వైద్య సహాయం పొందుతున్న వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం కలవరం కలిగించిందని, చాలామందిని ఆందోళనకు గురిచేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజులు గుంజుతున్న తీరుపై తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కరోనా బాధితుల పట్ల ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల విధుల నిర్వహణకు సిబ్బంది నియామకం.. వైద్యుల రిక్రూట్మెంట్ చేయడంతో పాటు సదుపాయాలు కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. అదే సమయంలో ఉచితంగా కరోనా సేవలు అందించేందుకు ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతినిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు. (అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుపై దళిత నేతల హర్షం)

బాధితులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయా ఆసుపత్రిలో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. నాన్ క్రిటికల్ పేషెంట్లకు రోజుకి రూ.3250 క్రిటికల్ కేర్ ఐసీయూలో వెంటిలేటర్ , ఎఐవీ అవసరం లేకుండా రోజుకి రూ.5,480.. ఐసీయూలో ఎన్ఏవీ చికిత్స రూ. 5980 అని తెలిపారు. అలాగే ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స రూ. 9,580.. వెంటిలేటర్ లేకుండా సెప్సిస్ చికిత్స రూ. 6,280 వెంటిలేటర్‌తో సెప్సిస్ చికిత్స రూ.10,380 ..నాన్ క్రిటికల్ పేషెంట్లు ఎవరైనా ప్రత్యేక రూమ్ కావాలని ఆశిస్తే అదనంగా రోజుకి రూ.600 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వైద్య సేవలు మరింత విస్తృతమవడమే కాకుండా ప్రజల్లో ఆందోళన తొలగి, కరోనాని ఎదుర్కొనే అవకాశం దక్కుతుందని లక్ష్మణరెడ్డి తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top