వెలిగొండ పనుల్లో బొల్లినేనికి బంపరాఫర్‌

Irregularities In Veligonda Project Works - Sakshi

కాకర్ల గ్యాప్‌ పనుల్లో రూ.36.40 కోట్లు అ‘ధనం’ ఇస్తూ ఉత్తర్వులు

ఈపీసీ మౌలిక సూత్రాలు తుంగలోకి..

డిజైన్‌ మారడంతో అదనపు పనులు చేయాల్సి వస్తోందని సాకులు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా సీఎం సన్నిహితులకు లబ్ధి చేకూర్చుతూ ఉత్తర్వులు

వెలిగొండ ప్రాజెక్టు, బొల్లినేని శీనయ్య, బీఎస్పీసీఎల్‌ సంస్థ

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో కాకర్ల గ్యాప్‌ పనుల్లో సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌ సంస్థకు రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చెప్పడం ఆలస్యం.. ఆయన సూచనలు పాటిస్తూ ఆగమేఘాలపై సదరు కాంట్రాక్టర్‌కు బంపర్‌ ఆఫర్‌ కింద ఈ అ‘ధన’పు సొమ్ము మంజూరు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీపీ) మౌలిక సూత్రాల్ని తుంగలో తొక్కేశారు. డిజైన్‌ మారడం వల్ల కాంట్రాక్టర్‌ అదనపు పనులు చేయాల్సి వచ్చిందని.. ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించాల్సి వస్తోందంటూ ఉత్తర్వుల్లో సమర్థించుకోవడం గమనార్హం.

ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా కాంట్రాక్టర్‌కు అదనపు లబ్ధి చేకూర్చుతూ ఇలా ఉత్తర్వులు జారీ చేయడాన్ని జలవనరుల శాఖ వర్గాలే తప్పుపడుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా కాకర్ల గ్యాప్‌ను పూడ్చటం ద్వారా ఎన్వోఎఫ్‌ డ్యామ్‌ నిర్మించి.. దాని ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు పనుల్ని రూ.206.80 కోట్లకు ఎస్‌సీఎల్‌–బీఎస్పీసీఎల్‌(జేవీ) 2005లో దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పనులు పూర్తి కావాలి. కానీ పనులు పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయినా పనులు పూర్తి చేయలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌పై అమితప్రేమ చూపింది.

డిజైన్‌ మారడంతో 30 కాంక్రీట్‌ నిర్మాణాల స్థానంలో 48 నిర్మించాల్సి వస్తోందని.. ఆ మేరకు అదనపు బిల్లులివ్వాలని ఆ సంస్థ 2015లో సర్కార్‌కు ప్రతిపాదనలు పంపింది. ఈపీసీ విధానానికి ఇది విరుద్ధమని జలవనరులశాఖ అధికారులు తోసిపుచ్చారు. అయితే సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో జిల్లా స్థాయి స్టాండింగ్‌ కమిటీ(డీఎల్‌ఎస్‌సీ), స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ)లకు ఈ ప్రతిపాదనలను పంపారు. ఆ కమిటీల్లోని అధికారులపై ఒత్తిడి తెచ్చి అదనపు బిల్లుల మంజూరుచేసేలా ప్రతిపాదన చేయించారు.

గత నాలుగేళ్లుగా ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి ఇంటర్నల్‌ బెంచ్‌మార్క్‌ కమిటీ(ఐబీఎం) తిరస్కరిస్తూ వచ్చింది. ఐబీఎం కమిటీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అదనపు నిధులిచ్చే ప్రతిపాదనపై చంద్రబాబు ఆమోదముద్ర వేయించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టర్‌కు అదనపు లబ్ధి కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయకూడదు. కానీ సీఎం సూచనల మేరకు బొల్లినేనికి రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ ఉత్తర్వులు జారీ చేసేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top