ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం ముగిశాయి.
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం ముగిశాయి. విద్యాసంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంలో ఎగిరి గంతేశారు. ఉత్తమ ఫలితాల సాధనకు శ్రమించి చదివిన వారంతా పరీక్షా కేంద్రాల నుంచి ఉత్సాహంగా బయటకు అడుగుపెట్టారు. పరీక్షా కేంద్రాల్లో పరిచయమైన మిత్రులకు వీడ్కోలు పలికారు. బస్సుల్లో ఎక్కి కేరింతలు కొడుతూ, కాగితాలు చించి రోడ్లపై చల్లుతూ విజయ చిహ్నం చూపుతూ సందడి చేశారు.
చివరి రోజు ఒక విద్యార్థి డిబార్..
పరీక్షల చివరి రోజు జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీసు కేసు నమోదయింది. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒకేషనల్ పరీక్ష రాస్తూ అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్డడ్డాడు. గుర్తించిన అధికారులు అతడిని డిబార్ చేశారు. ఈనెల 12న ప్రారంభమైన ప్రథమ సంవత్సర పరీక్షల్లో మొత్తం 16 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడి డిబార్ అయ్యారు. ఈనెల 18న ఏడుగురు, 20న మరో ఏడుగురు, 22న ఒకరు, మంగళవారం మరొకరు డిబారయ్యారు.