మెరుగైన రవాణా వ్యవస్థ.. ఓ భ్రమ! | Sakshi
Sakshi News home page

మెరుగైన రవాణా వ్యవస్థ.. ఓ భ్రమ!

Published Mon, Jul 30 2018 4:18 AM

Improved transport system is a dream - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్‌ సమస్య అంతకంతకూ జటిలమవుతోంది. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో ప్రజానీకం యాతన పడుతున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా మెరుగైన రవాణా వ్యవస్థ నెలకొల్పుతామని ప్రభుత్వం హడావుడి చేసింది. కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఏళ్లు గడుస్తున్నా ప్రణాళికలు రూపొందించలేదు.

మరోవైపు సమీకృత రవాణా వ్యవస్థ నెలకొల్పేందుకంటూ రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీస్‌(రైట్స్‌) అనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది కాగితాలను దాటలేదు. అదే సమయంలో ఈ పేరిట ప్రభుత్వాధికారులు రూ.లక్షలు వెచ్చించి అధ్యయన యాత్రలు చేస్తూ రాష్ట్రాలు, దేశాలు చుట్టి వస్తున్నారు తప్ప ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందించట్లేదు. దీంతో మెరుగైన రవాణా వ్యవస్థ ఓ భ్రమగానే మిగిలిపోతోంది.

మొక్కుబడి..
రాష్ట్రంలో సమీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటుకోసమంటూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్‌తో కలిపి మొత్తం 13 మందితో కమిటీ ఏర్పాటైంది. కానీ ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇది భేటీ కాలేదు.

ఆర్‌అండ్‌బీ అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించి రవాణా శాఖ కమిషనర్‌కు చోటు కల్పించలేదు. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధి, ఏవియేషన్‌ సెక్టార్, జల రవాణా, సీఆర్‌డీఏలో రవాణా, రోడ్లు, రైల్వేలకు సంబంధించి మెరుగైన రవాణా వ్యవస్థకోసం ప్రణాళిక రూపొందించాలి. ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యల్లేవు. కమిటీని మొక్కుబడికే ఏర్పాటు చేశారనే విమర్శలు రవాణా రంగం నుంచే వినిపిస్తుండడం గమనార్హం.

‘రైట్స్‌’ ప్రతిపాదనలపైన సమీక్షేది?   
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీస్‌(రైట్స్‌) సంస్థ కొన్ని ప్రతిపాదనలు చేసింది. మెట్రో, రోడ్డు రవాణాకు బహుళ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు తదితరాలపై సర్వే నిర్వహించిన ఆ సంస్థ రాజధానిలో లైట్‌ మెట్రో, రోడ్డు రవాణాకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టవచ్చో.. తెలియజేస్తూ ప్రతిపాదనలిచ్చింది. అలాగే విశాఖ, తిరుపతి, గుంటూరు నగరాల్లో రవాణా వ్యవస్థపైనా సూచనలు చేసింది. అయితే ఈ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలపై ఇంకా సమీక్షించలేదు.


ఆర్టీసీదీ ఇదే దారి..
ఆర్టీసీ కూడా ఇదే దారిలో నడుస్తోంది. మెరుగైన రవాణా వ్యవస్థకు రూ.కోట్లు ఖర్చు చేసి సలహా కమిటీలు ఏర్పాటు చేసుకుంటోంది తప్ప అవి ఇస్తున్న సూచనలను పట్టించుకోవట్లేదు. ఆర్టీసీలో నష్టాలను అధిగమించడంపై సూచనలిచ్చేందుకు యాజమాన్యం రెండేళ్లక్రితం రూ.10 కోట్లు ఖర్చు చేసి బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) సహకారాన్ని కోరింది. ప్రొఫెసర్‌ రవికుమార్‌ నేతృత్వంలో ఐఐఎం బృందం ఆర్టీసీ స్థితిగతుల్ని నెలల తరబడి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది.

ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ వాటాగా ఉన్న 35 శాతాన్ని 50 శాతానికిపైగా పెంచుకోవాలని, ఇందుకోసం రాష్ట్రంలో ప్రతి పల్లెకు బస్సులు నడపాలని సూచించింది. అంతేగాక ఏటా ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్‌ రూపంలో రూ.200 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. ఇటీవలే ఆర్టీసీలో మెరుగైన రవాణా సేవలకు అవసరమైన సలహాలకోసం ఢిల్లీకి చెందిన వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిŠూట్యట్‌ ఇండియా(డబ్ల్యూఆర్‌ఐఐ)తో ఏపీఎస్‌ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌ఐఐ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అయితే ఈ సలహాలను ఇంతవరకు ఆర్టీసీ అమలు చేయలేదు.  

Advertisement
Advertisement