చిన్న వెంకన్న చెంత.. ఇదేమి చింత

illegal Liquor Stores in Dwaraka Tirumala - Sakshi

ద్వారకా తిరుమలలో భక్తులకు మద్యం దుకాణాల స్వాగతం

క్షేత్రంలో ఆధ్యాత్మికత కాపాడాలంటున్న భక్తులు

ద్వారకాతిరుమల: రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు ఇష్టారాజ్యంగా లైసెన్సులు ఇవ్వడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోను మద్యం ఏరులై పారుతోంది. దీంతో భక్తుల మనోభవాలు దెబ్బతింటున్నాయి. జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈ దుస్థితి మరింత ఎక్కువగా ఉంది. గతంలో చిన్నతిరుపతి క్షేత్రానికి వచ్చే భక్తులకు గరుడాళ్వార్‌ విగ్రహం స్వాగతం పలికేది. ఇప్పుడు మద్యం దుకాణాలు, వాటి బోర్డులే ఆహ్వానం పలుకుతున్నాయి. క్షేత్రంలోని దేవస్థానం ఆర్చిగేట్లు, స్వామివారి మండపాలు, దేవతామూర్తుల విగ్రహాలకు కూతవేటు దూరంలోనే మద్యం దుకాణాలు ఉండటంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. 

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టంలోని నియమ నిబంధనలను పాలకులు, అధికారులు తుంగలోకి తొక్కి మరీ, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రంలో గుడికి, బడికి వంద మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉన్నాయంటున్న వ్యాపారులు విక్రయాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టం ప్రకారం ఇది తప్పని అడిగేవారు లేకపోవడంతో ప్రముఖ క్షేత్రాల్లో మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇష్టానుసారం లైసెన్సులను ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

లైసెన్సుల్ని రద్దు చేయాలి
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టం సెక్షన్‌ 2 లోని సబ్‌ సెక్షన్‌ 27 ప్రకారం దేవతామూర్తుల కైంకర్యాలకు వినియోగించే తెప్పోత్సవ మండపాలు సైతం గుడిలో భాగమే. అంతేకాదు మతపరమైన ఆరాధనా స్థలాలు, మందిరాలు, పుణ్యక్షేత్రాలు, ఉప పుణ్యక్షేత్రాలు ఇలా అన్నింటి సమూహమే ఆలయమని చట్టం చెబుతోంది. దీని ప్రకారం శ్రీవారి క్షేత్రంలో శివ మండపం, విలాస మండపం, ఆర్చిగేట్లు, దేవతామూర్తుల విగ్రహాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు. అవి క్షేత్రంలో అమలవడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే క్షేత్రాల్లో పవిత్రత దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

భక్తులే టార్గెట్‌
మద్యం వ్యాపారులు భక్తులనే లక్ష్యంగా చేసుకుని క్షేత్రాల్లో మద్యం విక్రయాల్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. వివాహాది శుభకార్యాలు జరిగే సమయాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ద్వారకాతిరుమలలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. క్వార్టర్‌ బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ. 10లు వ్యాపారులు వసూలు చేస్తున్నారు. మందుబాబులు మాత్రం మద్యం దొరికితే చాలన్నట్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం క్షేత్రంలో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది.

ప్రముఖ క్షేత్రాల్లో అడ్డుకట్ట వేయాలి
ఇప్పటికైనా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించి, ప్రముఖ క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి, క్షేత్రాల పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. హిందూ మత పరిరక్షకులు క్షేత్రాల్లో మద్యం విక్రయాలను ఎందుకు అడ్డుకోవడం లేదని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. చినవెంకన్నను దర్శించేందుకు క్షేత్రానికి వచ్చి, తాగి పడిపోతున్న భక్తుల వల్ల, యాత్రికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. చిన్న తిరుపతిలో మాడ వీధులు లేకపోవడం వల్ల స్వామివారి వాహనాలు క్షేత్ర పురవీధుల్లో తిరగాల్సి వస్తోంది. దీంతో క్షేత్రంలో ఉన్న మద్యం దుకాణాల మీదుగా శ్రీవారి వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రాష్ట్రంలోని ప్రధాన క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు చెక్‌ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top