ఎన్నికల వేళ.. మద్యం ఎర!  

Illegal Liquor Distribution By TDP Leaders  - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నేతలు మద్యం ప్రవాహానికి తెరతీశారు. జిల్లాలో టీడీపీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు టోకున మద్యాన్ని కొనుగోలు చేసి ఓటరును మద్యం మత్తులో ముంచెత్తడానికి సిద్ధమయ్యారు.  దీంతో మద్యం దుకాణాదారులు దొరికిందే అవకాశమని విచ్చలవిడిగా ధరలు పెంచి విక్రయించేస్తున్నారు. నియంత్రించాల్సిన, నిఘా పెట్టాల్సిన అబ్కారీ శాఖ మాత్రం మౌన వ్రతం పాటిస్తుండటంతో జిల్లా మద్యం ఏరులై పారుతోంది. 

పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు..
టీడీపీ అభ్యర్థులు బరితెగించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా మందును వార్డులకు, డివిజన్లకు చేరుస్తున్నారు. పలువురు టీడీపీ అభ్యర్థులు భారీగా మద్యం నిల్వలను ఉంచారు. ఇదే అదునుగా తీసుకున్న మద్యం దుకాణాదారులు ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై రూ. 20 వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఇక బెల్టు షాపులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గ్రామ గ్రామాన విచ్చలవిడిగా బెల్టుషాపులు పుట్టుకొచ్చాయి. 

చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఆగని మద్యం
జిల్లాలో రెండు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల పరిధిలో  గరికపాడు, వత్సవాయి, తిరువూరు ప్రాంతాల్లో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అలాగే గుంటూరు, పశ్చిమగోదావరి జిలాఈ్లలో సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ కోసం తాత్కాళిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలతో సరిహద్దు ఉన్న తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో నాటుసారా తయారీ పెరిగింది. తెలంగాణ నుంచి పన్నులు చెల్లించని మద్యం కూడా వస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 300 కేసులు నమోదయ్యాయి. 32,417.43 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 1.30 కోట్లు. 281 మందిపై కేసు నమోదు చేశారు.

ఇటీవల మొగల్రాజపురం టిక్కిల్‌ రోడ్డులో హేంగోవర్‌ మద్యం దుకాణ యజమాని ఓ గదిని అద్దెకు తీసుకుని 77.67 లక్షల విలువైన మద్యం నిల్వలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు.  ముదినేపల్లి ప్రాంతంలోని చెక్‌పోస్ట్‌లో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో రూ.12.78లక్షల విలువగల 687 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. 

ఎమ్మార్పీ ఉల్లంఘన.. 
ఎన్నికల సందడి ఆకాశాన్నంటగా.. మద్యానికి గిరాకీ విపరీతంగా పెరిగింది. కార్యకర్తలు చుక్కేసుకునిగానీ పార్టీల ప్రచారాల్లోకి దిగడం లేదు. ఏ మద్యం షాపు చూసినా కిటకిటలాడుతూ కన్పిస్తోంది. ఇదే అదనుగా కొందరు షాపుల యజమానులు మద్యం ధరలను భారీగా పెంచి విక్రయిస్తున్నారు.

ఎన్నికల సీజన్‌ కనుక నిల్వలు లేవని చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్వార్టరు బాటిల్‌ ధరను రూ. 20 వరకు పెంచి విక్రయిస్తున్నారు. నెలల కిందటే వీరు పెద్ద ఎత్తున సరుకు తెచ్చుకుని నిల్వ ఉంచుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top