లెక్కల్లో గోరంత...తవ్వకాల్లో కొండంత...  | Illegal Gravel Excavations In Vijayanagar District | Sakshi
Sakshi News home page

లెక్కల్లో గోరంత...తవ్వకాల్లో కొండంత... 

Jul 5 2020 12:44 PM | Updated on Jul 5 2020 12:44 PM

Illegal Gravel Excavations In Vijayanagar District - Sakshi

ఇది బాడంగి మండలంలోని అంబటి బంద. చిన్నపాటి ఈ బందలో వరుసగా ట్రాక్టర్లు పెట్టి గ్రావెల్‌ను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వాల్టా చట్టం కానీ, గనుల చట్టం కానీ, రెవెన్యూ చట్టాలు కానీ వీరిని ఏమీ చేయట్లేదు. ఎందుకంటే మేం మేనేజ్‌ చేసుకుంటాం లెండి అంటుంటారు.

జిల్లాలో ఏ చెరువులో గ్రావెల్‌ కనిపించినా అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు. అనుమతులు అక్కర్లేకుండానే ఇష్టానుసారం తవ్వేసి ఎంచక్కా కాసులు కూడేసుకుంటున్నారు. వీరికి రియల్టర్లు... కాంట్రాక్టర్లు... సహకారం అందిస్తుండటంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పోనీ అధికారులు ఏమైనా అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. వారు కూడా ‘మామ్మూలు’గానే వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఇటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతోంది సరికదా... ప్రభుత్వ ఆస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది. 

బొబ్బిలి:  జిల్లాలో 10,436 చెరువులున్నాయి. ఇందులో దాదాపు 35 శాతానికి పైగా చెరువుల్లోఅడ్డు అదుపు లేకుండా తవ్వేస్తున్నారు. వీరి తవ్వకాల వల్ల చెరువుల మదుములు పాడైపోతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల మదుములు లోతై కొద్దిపాటి నీరు కూడా పక్కనున్న పొలాలకు వెళ్లట్లేదు. తద్వారా రైతుల భూములు బీళ్లవుతున్నాయి. మరో పక్క వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కడమే వీరి పనిగా ఉంది. జిల్లాలోని మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఆరుకు పైగా ఉండగా అందులో చాలా మట్టుకు వృద్ధి లేదు. మరో పక్క గ్రావెల్‌ మాత్రం ఏకంగా పెరిగిపోయింది. 2018–19 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఏకంగా 159 శా తం తవ్వకాలు పెరిగిపోయాయి.

 ఇది కేవలం కాంట్రాక్టర్లు చేపడుతున్న వివిధ పనులు, రియల్‌ ఎస్టేట్ల కోసం మా త్రమే! 2018–19లో 47,726 టన్నుల గ్రావెల్‌ను తవి్వతే ఈ ఏడాది ఏకంగా 1,23,704 టన్నుల గ్రావెల్‌ను తవ్వేశారు.  

కొద్దిపాటికే అనుమతి...  
‘ఓ పది లోడ్లు మాత్రమే వేసుకుంటాం సార్‌’ అని అధికారులతో ఎంచక్కా మాట్లాడి అనుమతులు తెచ్చుకునే రియల్ట ర్లు, కాంట్రాక్టర్లు ఆ తరువాత వారి విశ్వరూపం చూపెడుతున్నారు. ఏకంగా రాత్రీ పగలూ తవ్వకాలు జరుపుతునే ఉంటారు. దీంతో చెరువులు, వాగులు, వంకలూ రూపును కో ల్పోతున్నాయి. చాలా చోట్ల విపరీతమయిన లోతును తవ్వేసి వదిలేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిండిపోయి అంచనా దొరకక పలువురు చిన్నారులు, యువత అందులో పడి మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో గతంలో పలు చోట్ల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 

రహదారులు కూడా ధ్వంసం  
వివిధ రకాల కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రక్లర్లు తమకు కేటా యించిన పనులను చేస్తూ వాహనాలను జోరుగా నడపడం వల్ల గ్రావెల్, ఇసుక వంటివి రోడ్లపైనే పడుతున్నాయి. ఫలితంగా రోడ్లు బురదమయం కావడం లేదా ఇసుకతో నిండిపోవడం జరుగుతోంది. దీనిపై ప్రయాణించే వాహన చోదకులు అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజలు నడవడానికి కూడా వీలుకాని స్థితిలో ఉన్నాయి.

బాడంగి మండలం డొంకినవలసలోని వేర్‌ హౌసింగ్‌ గోదాము నుంచి అటు రైల్వే స్టేషన్‌కు ఇటు అంతర్రాష్ట్ర రహదారికి అనుసంధానమైన పక్కా తారు రోడ్డు. కానీ చూడటానికి గ్రావెల్‌ రహదారిలా కనిపిస్తోంది. కారణం... ఇక్కడ గోదాముల నిర్మాణానికి సమీపంలోని అంబటి బందలో పొక్లెయినర్‌తో తవ్వకా లు జరిపిన గ్రావెల్‌ను ఈ రహదారి మీదుగా తరలిస్తున్నారు. ముందు ఓ పక్కనున్న చాకలి బందలో తవ్వి ఇప్పుడు అవతలి వైపున్న అంబటి బంద నుంచి తవ్వేస్తున్నారు. అందువల్ల ఈ రహదారి దుస్థితి ఇలా తయారైంది.
  

చర్యలు తీసుకుంటాం 
ఏయే ప్రాంతాల్లో గ్రావెల్‌ తవ్వకాలు అనధికారికంగా జరుపుతున్నారో కనుక్కుని చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. గనుల శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాం. 
– పూర్ణచంద్ర రావు, ఉప సంచాలకుడు, గనుల శాఖ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement