హైడ్రామా | High drama | Sakshi
Sakshi News home page

హైడ్రామా

Aug 12 2015 2:42 AM | Updated on Aug 10 2018 8:16 PM

హైడ్రామా - Sakshi

హైడ్రామా

నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం హైడ్రామా నడిచింది. ప్రిన్సిపల్‌కో న్యాయం.. ప్రొఫెసర్‌కిఇంకో న్యాయం జరిగింది

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం హైడ్రామా నడిచింది. ప్రిన్సిపల్‌కో న్యాయం.. ప్రొఫెసర్‌కిఇంకో న్యాయం జరిగింది. మెడికల్ కళాశాల ప్రొఫెసర్ టీడీపీ నగర నేత బంధువు కావటంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తలొగ్గారు. వేళకు రాలేదని ఉదయం ప్రొఫెసర్‌ని  సస్పెండ్ చేసిన మంత్రి ఆవేశం సాయంత్రానికి చల్లారింది. ప్రొఫెసర్ సస్పెన్షన్ ఎత్తేసినట్లు మంత్రి కామినేని ప్రకటించటం గమనార్హం. నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, మెడికల్ కళాశాలలను మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ఉదయం 9.30కు ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. 10 గంటలకు మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. మంత్రి తనిఖీ చేసిన సమయంలో ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన మంత్రి శ్రీనివాస్ ఆయనను వెంటనే రిలీవ్ చేయమని ఆశాఖ డీఎంకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ప్రొఫెసర్ శశికాంత్ వేళకు రాలేదని గమనించిన మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు మంత్రి కామినేని ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాలకు వచ్చిన సమయంలో ప్రొఫెసర్ శశికాంత్ అక్కడ లేరు.

మంత్రి కళాశాలకు వచ్చిన వెంటనే హాజరుపట్టీని తీసుకుని చెక్‌చేశారు. అందులో విధుల్లో ఉండి సంతకం చేయని వారి పేర్లు పక్కన మంత్రి నోట్ పెట్టారు. మంత్రి తనిఖీకి వచ్చారని తెలుసుకున్న ప్రొఫెసర్ శశికాంత్ 10.15కు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కామినేని సిబ్బంది, అధికారులతో మాట్లాడుతుండగా.. ప్రొఫెసర్ రిజిస్టర్ తీసుకుని పక్కకు వెళ్లి సంతకం చేశారు. గమనించిన మంత్రి సెక్యూరిటీ విషయాన్ని కామినేనికి తెలిపారు. ఆగ్రహించిన మంత్రి ప్రొఫెసర్ శశికాంత్‌ని పిలిచి ‘ఇంతలా బరితెగిస్తారా? దొంగల్లా వ్యవహరిస్తున్నారే’ అంటూ మండిపడ్డారు.

తాను పొస్టుమార్టానికి వెళ్లానని, అందుకే ఆలస్యమైందని ప్రొఫెసర్ సమాధానం చెప్పారు. వెంటనే మంత్రి తన పీఏని అక్కడికెళ్లి విచారించుకుని రమ్మని ఆదేశించారు. వెంటనే ప్రొఫెసర్ అక్కడికి వెళ్లలేదని, పొరపాటైందని ప్రాధేయపడ్డారు. మంత్రికి మరింత ఆగ్రహానికి గురై ‘నిన్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నా’ అంటూ వెళ్లిపోయారు.

 టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు.. మంత్రి రాజీ
 ప్రొఫెసర్ శశికాంత్ నగర టీడీపీ నేతకు స్వయాన సోదరుడు. అతను ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. సోదరుని ద్వారా ప్రొఫెసర్ రాజీయత్నాలు ప్రారంభించారు. సోమిరెడ్డి, బీజేపీ నాయకుల నుంచి ఒత్తిడి చేయించినట్లు సమాచారం. సాయంత్రానికి మంత్రి చల్లబడ్డారు. ప్రొఫెసర్ శశికాంత్ సస్పెండ్‌ని ఎత్తివేసినట్లు స్వయంగా మంత్రి కామినేని సాక్షి విలేకరికి ఫోన్లో వెల్లడించారు. తాను విజిట్‌కి వచ్చిన సమయంలో ప్రొఫెసర్ శశికాంత్ పోస్టుమార్టానికి వెళ్లినట్లు సీఐ చెప్పారని తెలిపారు.

అందుకే అతని సస్పెన్షన్ ఎత్తేసినట్లు చెప్పారు. ప్రిన్సిపల్‌ని మాత్రం రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మంత్రి పీఏని విచారించి రమ్మని చెప్పిన సమయంలో ప్రొఫెసర్ ‘సారీ సార్ పొరబాటైంది క్షమించండి’ అని అబద్ధం చెప్పినట్టు ఒప్పుకున్న ప్రొఫెసర్.. సాయంత్రానికి అది ఎలా నిజమైందని కళాశాలలో పనిచేసే సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. బంధువులకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement