ఆగస్టు లోపు హంద్రీ-నీవా పూర్తి చేస్తా | Handri-niva will complete the August deadline | Sakshi
Sakshi News home page

ఆగస్టు లోపు హంద్రీ-నీవా పూర్తి చేస్తా

Apr 10 2016 1:33 AM | Updated on Sep 26 2018 6:21 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో పర్యటించారు. మదనపల్లెలో హంద్రీ-నీవా టన్నెల్ పనులను పరిశీలించారు.

మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయరు పనులు త్వరలో ముగింపు
టేకుమంద-  కీరమందల వద్ద రూ.9 కోట్లతో చెరువుల అభివృద్ధి
వచ్చే సీజన్ నాటికి చెరువులు తెగకుండా చర్యలు

 

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  శనివారం జిల్లాలో పర్యటించారు. మదనపల్లెలో హంద్రీ-నీవా టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం చిత్తూరులో జరిగిన నీరు-ప్రగతి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాపై ప్రేమ చాటేలా మాట్లాడారు.  మదనపల్లెలో మాట్లాడుతూ హంద్రీ-నీవా రెండో దశ పనులను ఆగస్టు లోపు పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను  ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తికాకపోతే వేటు తప్పదని కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీచేశారు. అడవిపల్లె రిజర్వాయరు వద్ద పెండింగ్‌లో ఉన్న టెన్నల్ పనులను 45 రోజుల్లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. బాలాజీ రిజర్వాయరు, మల్లెమడుగు, గాలేరు పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోమశిల-స్వర్ణముఖి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఐదు నెలల్లో పూర్తిచేసి, గాలేరు-నగరి కాలువకు కలుపుతామని పేర్కొన్నారు. బంగారుపాళెం మండలం టేకుమంద-కీరమందల వద్ద రూ.9 కోట్లతో చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వారిని ఎవరినైనా పైన కూర్చొని పెట్టే అవకాశం కల్పిస్తామంటూ, భూగర్భ జలాలు పెంపొందేందుకు కృషి చేసిన పలమనేరుకు చెందిన మల్లేశ్వర రెడ్డి అనే రైతును పక్కన కూర్చోపెట్టుకుని అభినందించారు.

 
భూగర్భ జలాలను పెంపొందించాలి

ప్రతి ఒక్కరూ భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని ముఖ్య మంత్రి కోరారు. పుంగనూరు సుగాలిమిట్ట వద్ద 80 మీటర్ల లోతుకు నీరు పడిపోయిందన్నారు. ఆ నీరు తాగితే కీళ్ల నొప్పులతో పాటు వారు వికలాంగులయ్యే అవకాశముందన్నారు. మామిడి చెట్లు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో నీరు-ప్రగతి, నీరు-చెట్టు, పంట సంజీవని కార్యక్రమాల ద్వారా భూగర్ఫ జలాలను పెంపొందించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. గొలుసుకట్టు చెరువుల మరమ్మతులు, చెరువుల్లో పూడిక తీత, పంటసంజీవని పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

 
చెరువులు తెగకుండా చూడాలి

జిల్లాలో వచ్చే సీజన్‌కు ఒక్క చెరువుకూడా తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో సాగునీటి సంఘాలు, జన్మభూమి కమిటీలు, ఉపాధి సూపర్‌వైజర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పేర్కొన్నారు. జిల్లాలో గత ఏడాది 3,700 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామని తెలిపారు.

 
రైతులకు ఎదురుప్రశ్న..

జిల్లాలో చెరువులు తెగిపోయానని, కాళంగి రిజర్వాయరు గేట్లు కొట్టుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని, కొంతమంది రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోయే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెరువులు తెగిపోయాయంటే మీరేం చేశారో చెప్పండి అంటూ ఎదురు్ర పశ్నించారు.  దీంతో రైతులు మౌనం పాటించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు డీఏ. సత్యప్రభ, సుగుణమ్మ, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీరామకృష్ణ, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ సంచాలకులు శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్,  డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లక్ష్మీ, ఉద్యానవన శాఖ డీడీ ధర్మజ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement