
హామీలు విస్మరించిన బాబు
మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు విస్మరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు.
సత్తెనపల్లి
మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు విస్మరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. పట్టణంలోని నాగార్జునగర్‌లోగల అంబటి రాంబాబు కార్యాలయం వద్ద సత్తెనపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. అధ్యక్షత వహించిన మర్రి మాట్లాడుతూ చంద్రబాబు అమలు కాని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి వంచించారన్నారు. మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇప్పుడు హామీ లు అమలుచేయడం లేదన్నారు. రాబో యే నాలుగేళ్లలో రైతులను రుణ విముక్తులను చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పెన్షన్‌లు తొలగించేందుకు నానారకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాలుగు నెలల టీడీపీ పాలనలో రెండు కిడ్నాపులు, ఎమ్మెల్యేపై దాడి ఇక జిల్లాలో అయితే ఇసుక, మట్టి అమ్ముకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆళ్ళ పేరిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ కలిసి అబద్ధపు హామీలు ఇచ్చాయని, హామీలు అమలుచేసేవరకు వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులు, మహిళలు నమ్మి ఓట్లువేశారని, అధికారంలోకి వచ్చాక కమిటీలతో కాలయాపన చేయడం బాధాకరమన్నారు.
సభాపతికి దౌర్జన్యంలో అనుభవం ఉందని, నరసరావుపేటలో చెల్లక ఇక్కడకు వచ్చారన్నారు. గెలుపు, ఓటములు సర్వసాధారణమని, గెలిపించిన ప్రజలకు సేవ చేయాల్సింది పోయి దౌర్జన్యాలు చేస్తూ, రేషన్ షాపులు తొలగిస్తూ అంగడి వస్తువులా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసగించారన్నారు. చంద్రబాబు మేక వన్నె పులి అన్న విషయం ప్రస్తుతం ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు లో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. రుణమాఫీ పేరుతో అందరినీ గందరగోళంలో పడేశారని, ప్రభుత్వ కార్యాలయాలను తెలుగుదేశం నాయకులు పంచుకుంటూ రౌడీయిజం చేస్తున్నారన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ అన్నివర్గాలను వంచించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్టమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నియోజవకర్గ సమన్వయకర్తలు క్రిస్టినా (తాడికొండ), బొల్లా బ్రహ్మనాయుడు (పెదకూరపాడు, వినుకొండ), సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు తదితరులు మాట్లాడారు. సేవాదళ్ ఆధ్వర్యంలో చేతిలో ఒక బాండు... చెవిలో ఒక పువ్వు అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు బాండును చేతికందజేసి చెవిలో పూలుపెట్టారు. ప్రభుత్వ హామీలు అమలు చేయాలని ఈ నెల 16న జిల్లాలోని తహశీల్దార్ల కార్యాలయాల ఎదుట చేపట్టే నిదర్శన ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.