రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం భక్తజనంలో కలకలం రేపుతోంది. ఆలయాల పవిత్రతకు భంగం వాటిల్లే చర్యలకు తెలుగుదేశం పార్టీ తెరతీస్తుందనే భయాన్ని వ్యక్తం చేస్తోంది.
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం భక్తజనంలో కలకలం రేపుతోంది. ఆలయాల పవిత్రతకు భంగం వాటిల్లే చర్యలకు తెలుగుదేశం పార్టీ తెరతీస్తుందనే భయాన్ని వ్యక్తం చేస్తోంది. రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే ప్రతి ఆలయానికి పాలకమండలిని నియమించాలని తీసుకున్న నిర్ణయం వెనక రాజకీయ దృకోణం దాగివుందని విమర్శిస్తోంది. భక్తి, ముక్తి ప్రదాయినులుగా నిలిచే ఆలయాలకు రాజకీయ రంగు అంటే ప్రమాదం లేకపోలేదని భావిస్తోంది. అందరి దేవుడనే భావన భక్త జనం మది నుంచి మాయం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేస్తోంది.
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం తమ పార్టీ నాయకులకు రాజకీయ ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు వీలున్న అన్ని దారులను వెతుకుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రూ. కోటికి పైగా ఆదాయం ఉన్న ప్రతి ఆలయానికి తొమ్మిది మంది సభ్యుల తో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రూ. కోటికి పైగా ఆదాయం వచ్చే దేవాలయాలు జిల్లాలో కొన్ని ఉన్నాయి. ఇందులో అమరేశ్వరాలయం(అమరావతి), త్రికోటేశ్వర ఆలయం(కోటప్పకొండ), గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం (పెదకాకాని), లక్ష్మీనరసింహస్వామి ఆలయం(మంగళగిరి), కనకదుర్గమ్మ ఆలయం(కంఠంరాజు కొండూరు), లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం(వైకుంఠపురం), సహస్రలింగేశ్వరస్వామి ఆలయం, భావన్నారాయణస్వామి దేవాలయం (పొన్నూరు)ఉన్నాయి.
వీటిలో త్రికోటేశ్వరస్వామి ఆలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయాలకు ఇప్పటివరకు పాలకమండళ్లు లేవు.ఈ ఆలయాల కోసం గతంలో భూ ములు దానం చేసిన శాశ్వత ధర్మకర్తలే వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. తమ పూర్వీకులు భూములు దానం చేసిన ఆలయాలు కావడంతో వా రు బాధ్యతాయుతం గా ఉంటూ ఆల యాల పవిత్రతను కాపాడుతూ వస్తున్నారు.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మూడు ఆలయాలకూ పాలకమండళ్లు రానున్నాయి. అయితే వీటిని టీడీపీ నాయకగణం తో భర్తీ చేస్తే మాత్రం ఆలయాలకూ రాజకీయ రంగు అంటుకోనుందనే విమర్శలు వినవస్తున్నాయి.
జిల్లాలో భక్తులు అధికంగా వచ్చే దేవాలయాలు కావడంతో వీటిని రాజకీయ నేతల చేతికి అప్పగిస్తే పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవి కాక దేవాదాయ శాఖ పరిధిలో చిన్న చిన్న దేవాలయాలు సుమారు 200 వరకు ఉన్నాయి. వీటికి కూడా పాలక మండళ్లను నియమించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
తెలుగు తమ్ముళ్లకు ఉపాధి
కల్పించేందుకే..
పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పదవుల కోసం ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఆలయ కమిటీలు రాజకీయ ఉపాధి మార్గంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు పాలక మండళ్లు లేని దేవాలయాలకు సైతం కమిటీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక రాజకీయ కోణం ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
మార్కెట్ యార్డులు, కార్పొరేషన్లలో రాజకీయ నాయకులకు పదవు లు కల్పించినా పర్వాలేదనీ, కోటప్పకొండ, మంగళగిరి వంటి ఆలయ పాలక మండళ్లలో చోటు కలిస్తే మాత్రం దేవాలయాలకూ రాజకీయరంగు పులిమినట్టు అవుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేయకుండా అధికారుల కనుసన్నల్లో నడిచేలా నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.