‘ఇళ్లస్థలాల’ భూముల అభివృద్ధికి ఉత్తర్వులు

Government Government Given Orders For Development Of Home Places  Lands - Sakshi

ఉపాధి హామీ నిధులతో మౌలిక వసతుల కల్పన

భూమి చదును, అంతర్గత, లింకు రోడ్ల నిర్మాణం

12,291 ఎకరాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు 

2,702 ఎకరాల్లో పనులకు అనుమతులు మంజూరు

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పంపిణీకి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ముళ్ల పొదల తొలగింపు, భూమి చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణం, లింకు రోడ్లు నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇళ్ల స్థలాల కోసం కేటాయింపు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాకే ఆయా స్థలాల్లో పనులు చేపట్టాలని పేర్కొన్నారు.   

800 మీటర్ల అంతర్గత రోడ్లు
ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలంలో ‘ఉపాధి’ నిధులతో ఏయే పనులు చేపట్టవచ్చో స్పష్టంగా పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఉత్తర్వులిచ్చారు. ఎకరా విస్తీర్ణంలో గరిష్టంగా నాలుగు వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణం మేర భూమి చదునుకు అనుమతించారు. ఎకరా స్థలంలో గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణానికీ.. ఇళ్ల స్థలానికి కేటాయించిన స్థలం నుంచి దగ్గరగా ఉండే రోడ్డుకు కలుపుతూ గరిష్టంగా 5 కి.మీ పొడవున గ్రావెల్‌ రోడ్డు నిరి్మంచవచ్చని పేర్కొన్నారు. రూ. 5 లక్షల లోపు పనులకు పంచాయతీరాజ్‌ లేదా సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరు విభాగాల్లో పనిచేసే డీఈఈ.. రూ. 40 లక్షల వరకు పనులను ఈఈలు.. రూ. 2 కోట్ల వరకు పనులను జిల్లా ఎస్‌ఈలు, అంతకు మించి విలువ చేసే పనులను ఈఎన్‌సీ కార్యాలయంలోని సీఈలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

12,291 ఎకరాల్లో పనులకు ప్రతిపాదనలు
ఇళ్ల స్థలాల కోసం మొత్తం 12,291 ఎకరాల్లో రూ. 803 కోట్లతో నాలుగు రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనల్ని జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో 2,702 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు అనుమతుల జారీ చేసే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనులకు సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియ జిల్లాల్లో వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top