మెడపై కత్తిపెట్టి 15 కాసులు అపహరణ

Gold Theft By Thieves In West Godavari - Sakshi

సాక్షి, ద్వారకాతిరుమల: భార్యాభర్తలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు ఆగంతకులు లోనికి ప్రవేశించి వారిని కత్తితో బెదిరించి, దౌర్జన్యంగా 15 కాసుల బంగారాన్ని దోచుకుపోయారు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాదితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెలికాని వేణుగోపాలరావు, మనోరమ దంపతులు గ్రామ శివారులో ఉన్న వారి తాటాకింట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక గెడలతో నిర్మించిన దడిని చీల్చిలోనికి ప్రవేశించారు. ఆ తరువాత మంచంపై నిద్రిస్తున్న వేణుగోపాలరావును కిందకు నెట్టి, ఆయన మెడపై మాంసం కొట్టే కత్తిని పెట్టారు. దీంతో ఆయన కేకలు వేయడంతో భార్య మనోరమ నిద్రలేచి, తన భర్తను చంపవద్దని ఆగంతకులను వేడుకుంది. అదే సమయంలో వారు ఆమె మెడలో ఉన్న బంగారు నానుతాడును, చేతికున్న ఆరు బంగారు గాజులను దౌర్జన్యంగా లాక్కున్నారు. అనంతరం బీరువా తలుపులు తెరవమని మనోరమను వారు ఒత్తిడి చేశారు. బీరువాలో ఏమీ లేవని, తన భర్తను విడిచిపెట్టాలని ఆమె బోరున విలపిస్తూ ప్రాధేయపడింది. దీంతో వారు ఆ వృద్ధ దంపతులను విడిచిపెట్టి అక్కడి నుంచి ఉడాయించారు.

వేణుగోపాలరావు పక్షవాతంతో బాధపడుతున్నందున ఆగంతకులను ఎదురించలేకపోయారు. ఇదిలా ఉంటే జరిగిన విషయాన్ని వేణుగోపాలరావు తన బంధువుల ద్వారా ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏలూరు క్రైం డీఎస్పీ సుబ్రహ్మణ్యం, భీమడోలు సీఐ సీహెచ్‌.కొండలరావు, ద్వారకాతిరుమల ఎస్సై ఎన్‌.సూర్యభగవాన్, భీమడోలు ఎస్సై ఐ.వీర్రాజులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు రాబట్టారు. క్లూస్‌ టీమ్‌ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా బాధితురాలు మనోరమ మాట్లాడుతూ తమ ఇంట్లోకి చొరబడిన దొంగలు ముగ్గురు లుంగీలు ధరించి, ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకున్నట్టు పోలీసులకు తెలిపారు. వారు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చినట్లు చెప్పారు. ఇంట్లోని వంట గదిలోకి సైతం చొరబడి వారు సామాన్లను చిందరవందర చేశారని పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top