
నేడే జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుపతి నగరం నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
- ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్
- లక్ష్మీపురం సర్కిల్ నుంచి నగరంలో రోడ్‌షో
- తిరుపతిలో రెండు కుటుంబాలకు ఓదార్పు
- లీలామహల్ సర్కిల్‌లో భారీ బహిరంగ సభ
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుపతి నగరం నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ జనభేరి పేరిట నిర్వహించనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రానికే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, వీధుల్లో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు తరలిరానున్నారు.
లీలామహల్ సర్కిల్‌లో వేదిక నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ తలశిల రఘురాం, తిరుపతి నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పరిశీలించారు. సభాస్థలిలో చేయాల్సిన మార్పులు, చేర్పులు గురించి చర్చిం చారు. శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దక్షిణం వైపున వేదిక నిర్మించనున్నారు.
వైఎస్ జగన్ ఒక్కడే సమైక్యనాయకుడు : పెద్దిరెడ్డి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే సమైక్య నాయకుడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ఆయన అనేక విధాలుగా పోరాడారని గుర్తుచేశారు. సమైక్యనాయకుడిగా తిరుపతిలో ఎన్నికల ప్రచారభేరి మోగించేందుకు వస్తున్నారని తెలిపారు. ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కుప్పం, మదనపల్లె సభలను తలదన్నే విధంగా తిరుపతి వైఎస్సార్ జనభేరి సభ నిర్వహిస్తామన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరిగిందన్నారు. తెలంగాణలోనూ తమ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు.
జగన్ సీఎం అయితేనే సీమాంధ్ర అభివృద్ధి : భూమన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే సీమాంధ్ర సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆయన సభాస్థలి వద్ద మీడియాతో మాట్లాడుతూ జగనన్న సీఎం అయితేనే పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయన్నారు. విభజన వల్ల కోల్పోయిన విద్య, ఉపాధి అవకాశాలు తిరిగి నిలబెట్టుకోవాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా, యువత భవిష్యత్ బాగుపడాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడిన యోధుడిగా, ప్రజా పక్షపాతిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి నుంచి ఎన్నికల భేరిని మోగించేందుకు వస్తున్నారన్నారు.
చంద్రబాబు ఎన్నికల ప్రచార సభకన్నా, వైఎస్సార్ జనభేరి మూడింతల జనంతో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో జనం తరలివచ్చి సభను జయప్రదం చేయనున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను సీఎంను చేసేందుకు ప్రతిఒక్కరూ చేయుతనివ్వాలన్నారు. పట్టభద్రులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, సీమాంధ్రలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో, పట్టుదలతో ఉన్నారని ఆయన వివరించారు.
వార్డుల్లో విస్తృత ప్రచారం
తిరుపతి నగరంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు, అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్న వైఎస్సార్ జనభేరి సభకు హాజరుకావాలని ఆహ్వానించారు. దొడ్డాపురం వీధిలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.