కందికుంట అనుచరుడి వీరంగం | A Follower Of The TDP Leader Kandikunta Venkata Prasad Has Speaking Badly | Sakshi
Sakshi News home page

కందికుంట అనుచరుడి వీరంగం

Jul 14 2019 10:11 AM | Updated on Jul 14 2019 10:11 AM

A Follower Of The TDP Leader Kandikunta Venkata Prasad Has Speaking Badly - Sakshi

 స్టెర్లింగ్‌ కంపెనీ సూపర్‌వైజర్‌ను విచారణ చేస్తున్న ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ రమేష్‌బాబు 

సాక్షి, ఎన్‌పీకుంట: కదిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్‌ అనుచరుడు చెలరేగిపోయాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై పోలీస్‌ స్టేషన్‌లోనే దాడికి తెగబడ్డాడు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన ఎన్‌పీ కుంట మండలంలో సంచలనమైంది. వివరాల్లోకి వెళితే...
 
సోలార్‌ ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌గా..  
ఎన్పీకుంట మండల పరిధిలో నిర్మితమవుతున్న ‘స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌’ సోలార్‌ ప్లాంట్‌కు సంబంధించి జంగిల్‌ క్లియరెన్స్, భూమి చదను పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను కందికుంట అనుచరుడు రవి దక్కించుకున్నాడు. నిత్యం కూలీలను పని ప్రాంతానికి తరలించడం, తిరిగి వారిని నిర్దేశించిన చోటులో దింపేందుకు ట్రాక్టర్‌లను ఏర్పాటు చేసుకున్నాడు. ట్రాక్టర్‌లో కూలీలను తరలించే పనిలో పది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ధరమ్‌పుర గ్రామానికి చెందిన  సుఖవీర్‌ అనే యువకుడిని ఏర్పాటు చేసుకున్నాడు.   

భాష రాక ఇబ్బందులు 
శుక్రవారం సాయంత్రం కూలీలను ట్రాక్టర్‌లో ఎక్కించుకుని సుఖవీర్‌ పని ప్రాంతానికి వెళ్లాడు. అయితే మరొకరికి ట్రాక్టర్‌ను పొరబాటును తీసుకెళ్లి అక్కడే రాత్రి గడిపి శనివారం ఉదయం కూలీలను ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. తొమ్మిది గంటల సమయంలో  స్టెర్లింగ్‌ మెయిన్‌ గేటువద్దకు చేరుకోగానే అదే కంపెనీలో పనిచేస్తున్న  కదిరి మండలం గంగన్నగారిపల్లికి చెందిన శ్రీనివాసులు, రెడ్డప్ప, గంగాధర మరో ఆరుగురు అడ్డగించారు. అనుమతి లేకుండా తమ ట్రాక్టర్‌ను ఎలా తీసుకెళ్లావంటూ నిలదీశారు. తెలుగు భాషరాని సుఖవీర్‌కు వారు చెబుతున్న మాటలు అర్థం కాలేదు. వారికి సమాధానం ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన వారు సుఖవీర్‌తో పాటు పక్కనే ఉన్న ప్యారేలాల్‌ను రాడ్‌లు, రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఆ సమయంలో ఏకపక్షంగా సాగిన దాడిని అక్కడే ఉన్న కార్మికులు ఆవుల రమేష్, ఎం.వెంకటరమణ, మహేష్, మల్లికార్జున తదితరులు అడ్డుకుని మధ్యప్రదేశ్‌ వాసులను కాపాడారు.  

పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ 
తమపై జరిగిన దాడిని పోలీసుల దృష్టికి సుఖవీర్‌ తీసుకెళ్లాడు. దీంతో దాడికి పాల్పడిన గంగన్నగారిపల్లికి చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ సమయంలో కందికుంట అనుచరువు రవి అక్కడకు చేరుకున్నాడు. గంగాధర్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలకు దిగాడు. ‘మా ప్లాంట్‌లో పనులు చేసుకుని బతుకుతున్న మీరు.. మా డ్రైవర్‌నే కొడతరా’ అంటూ చిందులు తొక్కుతూ గంగాధర్‌ను బూటుకాలితో తన్నాడు. రవి దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారు. విషయం కాస్త బయటకు పొక్కడంతో చివరకు బాధితులు సుఖవీర్, ప్యారేలాల్‌ ఫిర్యాదు మేరకు గంగన్నవారిపల్లికి చెందిన 9 మందిపై, పోలీసుల అదుపులో ఉన్న గంగాధర్‌ను కాలితో తన్నినందుకు రవిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement