తొలి రోజే పోటెత్తిన భక్తులు

first day heavy crowd in roti festival

రొట్టెల పండగ ప్రారంభం    

భక్తులతో కిటకిటలాడిన బారాషహీద్‌ దర్గా

వివాహ, ఉద్యోగ రొట్టెలకు డిమాండ్‌  

కులమతాలకు అతీతకంగా నిర్వహించే రొట్టెల పండగ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజే బారాషహీద్‌ దర్గాకు భక్తులు పోటెత్తారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలు వదిలేందుకు, వరాలు కోరుకునే వారు పట్టుకునేందుకు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చారు. దీంతో స్వర్ణాల చెరువు వద్ద భక్తుల కోలాహలం నెలకొంది.

నెల్లూరు సిటీ: బారాషహీద్‌ దర్గాలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన రొట్టెల పండగకు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన భక్తులు అధికంగా తరలి వచ్చారు. తొలి రోజు వివాహ, విద్య, ఉద్యోగ రొట్టెలు అధిక శాతం మంది అందుకున్నారు. నగర పాలక సంస్థ అధికారులు భక్తుల సౌకర్యార్థం రొట్టెల పేర్లుతో కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు వద్ద రొట్టెలు వదిలేవారు, అందుకునే వారు సులభంగా వెళ్లేందుకు వీలు కల్పించారు.

అన్ని శాఖల సమన్వయంతో
దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఘాట్‌ నిర్వహణ కార్పొరేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతోంది.

ఘాట్‌ వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. ప్రమాదాలు సంభవించకుండా «అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో వాహనాలు పార్కింగ్‌ చేసేం దుకు 10 స్థలాలు ఏర్పాటు చేశారు.

దర్గా రోడ్డుకు ఇరుçవైపులా బ్యారికేడ్లు
బారాషహిద్‌ దర్గాకు వచ్చే క్రమంలో వాహనాలు రానివ్వకుండా రెండు వైపులా పోలీసు శాఖ బ్యారి కేడ్లు ఏర్పాటు చేసింది. పాస్‌లు ఉన్నవారి వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. దర్గాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. డ్రోన్‌ కెమెరాలతో దర్గా ప్రాంగణంలో నిఘా ఏర్పాటు చేసింది. 40సీసీ కెమెరాలతో దర్గా ఆవరణలో ఏమి జరుగుతుందో పోలీసు శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.

విధుల్లో నలుగురు మున్సిపల్‌ కమిషనర్లు
రొట్టెల పండగకు జిల్లాలోని నలుగురు మున్సిపల్‌ కమిషనర్లు విధుల్లో ఉన్నారు. వెంకటగిరి, గూడూ రు, ఆత్మకూరు, కావలి కమిషనర్లు నరేంద్రకుమార్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు పండగ ఏర్పాట్ల పర్యవేక్షణ విధులు కేటాయించారు. గతంలో పనిచేసిన కార్పొరేషన్‌ కమిషనర్‌ కరణం వెంకటేశ్వర్లను పండగ ఏర్పాట్లు చూసుకునేందుకు మంత్రి నారాయణ ప్రత్యేకంగా పిలిపించారు.

మూడు షిఫ్ట్‌లుగా విధులు
నగర పాలక సంస్థ నుంచి 350 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. దర్గా, స్వర్ణాల చెరువు పరసరాలు శుభ్రం చేసేందుకు కాంట్రాక్ట్‌ పద్ధతిన 830 మంది కార్మికులను తీసుకున్నారు. వీరందరికీ మూడు షిఫ్ట్‌లుగా విధులు కేటాయించారు. శానిటరీ సూపర్‌వైజర్‌ శివనాగేశ్వరరావు కార్మికులకు విధులు కేటాయించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు 320 మంది, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 10 గంటల వరకు 320 మంది రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు 190 మంది కార్మికులు పనిచేస్తారు.

సేవా కార్యక్రమాలు
రొట్టెల పండగకు వచ్చే లక్షల మంది భక్తులకు నీరు, మజ్జిగ, భోజనాలు కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీ సిమెంట్, సీఎంఆర్‌ షోరూమ్‌ ని ర్వాహకులు నీరు, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేశా రు. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు చెందిన హాజీ అబ్దుల్‌ అజీజ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదానం చేశారు. ఆదివారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని మేయర్‌ అజీజ్‌ ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top