బాబు పాలనలో  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హంబక్‌

Fee Reembersement Injustice Done To All Sections Youth - Sakshi

94 శాతం చెల్లించినట్లుగా ఆన్‌లైన్‌లో చూపుతున్న ప్రభుత్వం

ట్రెజరీల నుంచి రిలీజ్‌ చేయని వైనం

31తో ముగియనున్న గడువు

అగమ్యగోచరంలో కళాశాలల యాజమాన్యాలు    

ప్రతిభ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరు పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన బృహత్తర పథకాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (ఆర్‌టీఎఫ్‌) పథకం ఒకటి. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంపశయ్యపైకి చేర్చింది. వైఎస్సార్‌ హయాంలో సజావుగా సాగిన ఈ పథకం మూడు సంవత్సరాలుగా గాడి తప్పింది. ఈ పథకం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడి తప్పడంతో తల్లిదండ్రులను, విద్యార్థులను మనస్థాపానికి గురిచేస్తోంది. 

సాక్షి,గూడూరు: జిల్లాలో 478 కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు 83,550 మంది వివిధ రకాల కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరు 2018–19 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో స్కాలర్‌షిప్‌ రూ.90.92 కోట్లు,  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.266 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.495 కోట్లు ఉన్నాయి.

గతేడాది బీసీ, ఈబీసీ బకాయిలు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఫీజులను, స్కాలర్‌ షిప్‌లను 94 శాతం మంజూరు చేసినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నా.. విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.766.68 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం రూ.271.68 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది.   

పేదలకు వరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయిబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి కళాశాల గ్రేడ్‌ను బట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రతి ఏడాది ట్యూషన్‌ ఫీజు కింద రూ.35 వేల నుంచి రూ.90 వేల వరకు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ. 26 వేలకు పైగా ఆయా కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. దీంతో పాటు కళాశాలకు సంబంధించిన హాస్టల్‌లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ కింద రూ.13 వేలను అందజేసింది.

వీటితో పాటు స్పెషల్‌ ఫీజు కింద రూ. 5,500 విడుదల చేశారు. కళాశాల ఫీజులతో సంబంధం లేకుండా మెయింటెనెన్స్‌ కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.680 ఇచ్చారు. ఆ సమయంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. స్పెషల్‌ ఫీజు కింద ఇచ్చే రూ.5,500లను నిలిపివేశారు. కేవలం ఇంజినీరింగ్‌కు రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏకు రూ.27 వేలు విడుదల చేస్తున్నారు. దీంతో మిగతా మొత్తాన్ని ఆ పేదింటి తల్లిదండ్రులు కాయకష్టం చేసి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈయన పేరు కేఆర్‌రెడ్డి, గూడూరులోని ఎస్‌వీ ఆర్ట్స్‌ కళాశాల కరస్పాండెంట్‌. ఈ కళాశాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు ఉంది. అయితే ఈ నెల 18న  కేవలం రూ.2,875 మాత్రమే కళాశాల అకౌంట్‌లో జమ చేశారు. కోట్లాది రూపాయలు బకాయి ఉంటే.. కేవలం నామమాత్రంగా ఇలా చిన్న మొత్తాన్ని జమ చేయడంతో ఆయన ఖంగుతిన్నారు. కళాశాలకు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించినట్లు భ్రమ కల్పించే విధంగా ఉంది.

 ఈ కళాశాల నుంచి రూ.45 లక్షలు ట్రెజరీకి బిల్లు పెట్టి నెలలు గడుస్తున్నా, వాటిని ఇప్పటి వరకు క్లియర్‌ చేయడం లేదని కేఆర్‌ రెడ్డి వాపోతున్నారు. కళాశాలలో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులకు జీతాలెక్కడి నుంచి ఇవ్వగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కళాశాలను ఎన్నాళ్లు నెట్టుకురాగలమని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక కేఆర్‌ రెడ్డిది మాత్రమే కాదు.. జిల్లాలో వందలాది కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ఇలాగే ఉంది.  

జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలు రాకపోవడంతో యాజమాన్యాలు అప్పులు చేసి కొన్నాళ్లు ఇచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఇవ్వలేమని, కొంత మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. నెలంతా కష్టపడినా.. నెల ఆఖరులో జీతాలు రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి.
–  జీ శ్రీనివాసులు, అధ్యాపకులు 

చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలు చెల్లించకపోవడంతో పరీక్షలు రాయనిస్తారో లేదోనని ఆందోళనగా ఉంది. దీంతో చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నాం. ఎలాగోలా పరీక్షలు రాయనిస్తున్నారు. లేదంటే మా పరిస్థితి ఎలా?.
–  బీ మునిరాజా, ఎంబీఏ 

తీవ్ర ఒత్తిడికి గురయ్యాం
పరీక్షలు రాయనిస్తారో లేదో అని ప్రతి రోజు మేమంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాము. ఈ ప్రభుత్వానికి మాలాంటి పేద విద్యార్థులపై ఎంత విద్యార్థులపై ఎందుకింత చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. 
–  జే వంశీ, ఎంబీఏ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top