ఉచిత పంటల బీమాపై రైతుల్లో కొరవడిన అవగాహన | Farmers Still Unaware Of YSR Free Crop Insurance Scheme In Guntur District | Sakshi
Sakshi News home page

ఉచిత పంటల బీమాపై రైతుల్లో కొరవడిన అవగాహన

Jul 22 2019 11:12 AM | Updated on Jul 22 2019 11:12 AM

Farmers Still Unaware Of YSR Free Crop Insurance Scheme In Guntur District - Sakshi

సాక్షి, అమరావతి:వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంపై రైతుల్లో అవగాహన కొరవడటంతో ఆశించిన మేర బీమా చేయించుకునేందుకు అన్నదాతలు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రైతులు సాగు చేసే పంటలకు సంబంధించి ప్రీమియం కింద కేవలం రూపాయి చెల్లిస్తేచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలన్నర్ర సమయం కావొస్తున్నా పంటలకు బీమా చేయించేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ప్రధానంగా బీమా చెల్లింపుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది.

గతంలో భారంగా ప్రీమియం చెల్లింపు..!
గతేడాది వరకు పంటల రకాలను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. గతంలో వరి ఎకరానికి సుమారు రూ.700 వరకు రైతు ప్రీమియం రూపంలో చెల్లించేవారు. అలాగే పత్తికి రూ.1800, టమాటాకు రూ. 2,200, పసుపు పంటకు రూ.4 వేల వరకు ప్రీమియం ఉండేది. అప్పులు చేసి పంటలు సాగు చేసే రైతులకు పంట బీమా విషయం తలకు మించి భారంగా ఉండేది. దీంతో చాలా మంది రైతులు పంటలకు ప్రీమియం చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు.

రూపాయికే బీమా వర్తింపు
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టి సారించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో విని, తెలుసుకున్న ఆయన రైతులకు అండగా ఉండేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రకటించారు. రైతులు కేవలం రూపాయి చెల్లిస్తే చాలు పంటలకు అవసరమైన ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఫలితంగా రైతులపై ప్రీమియం భారాన్ని తొలగింది. మీ సేవా కేంద్రాల్లో రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది. రైతు వాటాను వ్యవసాయశాఖ జమ చేస్తుంది. పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకుంటే చాలు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

30 నుంచి 40 శాతం మంది మాత్రమే..!
జిల్లాలో ఇప్పటిదాకా పంటల బీమా నామమాత్రంగానే అమలవుతోంది. పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించేందుకు రైతులు ఆసక్తి కనబరిచే వారు కాదు. గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 3.15 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో కేవలం 35 శాతం పంటలకు మాత్రమే రైతులు బీమా చేయించారు. పంటలకు ప్రీమియం రుసుము అధికంగా ఉండడం, ఒక వేళ ప్రీమియం చెల్లించినా పంట నష్టపోయిన సమయంలో బీమా సంస్థల కొర్రీల వల్ల రైతులకు పరిహారం సక్రమంగా అందేది కాదు. ఈ కారణాలతో బీమా చేయించేందుకు రైతులు ముందడుగు వేసేవారు కాదు. 

31 చివరి తేదీ.. 
మొక్కజొన్న, పెసర, కంది, మిర్చి, పత్తి, వేరుశనగ, చెరుకు తదితర పంటలకు ఈ నెల 31వ తేదీ తుది గడువు. వరి పంటకు బీమా చెల్లించేందుకు ఆగస్ట్‌ 21 తుది గడువు. వరి తప్పితే మిగిలిన పంటలకు ప్రీమియం (రూ.1) చెల్లించేందుకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 30 శాతం మంది రైతులే ప్రీమియం రుసుము చెల్లించి, పంట వివరాలు నమోదు చేసినట్లు తెలిసింది. 

అవగాహన కల్పిస్తున్నాం..
పంటల బీమా అంశంపై రైతులకు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. ఉచిత పంటల బీమా పథకాన్ని వంద శాతం మంది రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 
– టి.మోహనరావు, జేడీఏ    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement