కాటేసిన కరెంటు

Farmer Death With Power Shock Srikakulam - Sakshi

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

చెరుకు పొలంలో గడ్డిమందు పిచికారీ చేస్తుండగా ఘటన

ప్రాణాపాయం నుంచి బయట పడిన మరో నలుగురు

శ్రీకాకుళం, గార: అన్నదాతను విద్యుత్‌ తీగ కాటేసింది. చెరుకు పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా.. తెగిపడిఉన్న విద్యుత్‌ తీగ తగలడంతో షాక్‌కు గురై రైతు చనిపోగా... మరో నలుగురు ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన గార మండలం శాలిహుండం గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కిర్రు రామారావు అలియాస్‌ రమేష్‌ (36) చనిపోగా.. మృతుడి భార్య ధనలక్ష్మి, బొంతల పద్మ, కిర్రు జగ్గారావు, చింతల బాలరాజులకు షాక్‌ తగలడంతో గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించి స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకు తోటలో గడ్డి ఎక్కువగా ఉండడంతో నివారణ కోసం మందు పిచికారీ చేసేందుకు శాలిహుండం గ్రామానికి చెందిన కిర్రు రమేష్‌ తన భార్య ధనలక్ష్మిని తీసుకొని గురువారం ఉదయం పొలానికి వెళ్లారు. అయితే అప్పటికే పొలంలో పైనుంచి ఉన్న విద్యుత్‌ లైన్‌తీగ ఒకటి తెగిపడి ఉంది. దీన్ని రమేష్‌ గమనించకుడా.. గడ్డి నివారణ మందును పిచికారీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు.

ఇంతలో తీగ భూజానికి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అతని భార్య ధనలక్ష్మి పరుగున వస్తుండగా ఆమెకు కూడా తీగ తగలడంతో షాక్‌కు గురైంది. ఆమె కూడా కేకలు వేయడంతో సమీపంలో పొలం పనులు చేస్తున్న బొంతల పద్మ  పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో విద్యుత్‌తీగ తగలడంతో ఆమె కూడా షాక్‌కు గురైంది. వీరిని రక్షించేందుకు వచ్చిన కిర్రు జగ్గారావు, చింతల బాలరాజులు కూడా తీగను తాకడంతో షాక్‌కుగురయ్యారు. అయితే స్థానికంగా ఉన్న మరికొందరు విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే సరఫరాను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన రైతు రమేష్, అతని భార్య ధనలక్ష్మిలను 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్‌ మృతి చెందాడు. ధనలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్య సేవలందిస్తున్నారు. గాయాలపాలైన పద్మ గారలో వైద్య పొందుతుంది. స్వల్పంగా గాయపడిన కిర్రు జగ్గారావు, చింతల బాలరాజు స్థానికంగానే చికిత్స పొందారు. మృతి చెందిన రమేష్‌కు కుమారుడు వినయ్, కూతురు శైలు ఉన్నారు. 

గ్రామంలో విషాదఛాయలు
అందరితోకలివిడిగా ఉండే రమేష్‌ చనిపోవడం, భార్య ధనలక్ష్మి తీవ్రంగా గాయపడడంతో శాలిహుండం గ్రా మంలో విషాదఛాయలు అలముకున్నాయి. రిమ్స్‌లో వైద్యం పొందుతున్న ధనలక్ష్మిని ఎంపీపీ ప్రతినిధి గుం డ భాస్కరరావు, మాజీ సర్పంచ్‌ కొంక్యాన ఆదినారా యణ, వైఎస్సార్‌సీపీ మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చింతల గడ్డెయ్య పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై బలివాడ గణేష్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top