టీడీపీ నాయకుల దొంగ ఓటర్లాట..!

Fake Survey Team in Chittoor - Sakshi

ఓటు పవిత్రతను ఖూనీ చేస్తున్న వైనం

భారీగా దొంగ ఓట్లున్నా పట్టించుకోని అధికారులు

ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

ఈసారి ఎన్నికల్లో గెలవలేమని టీడీపీ నాయకులు అడ్డదారులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పార్టీ అనుకూలురనుకున్న వారి పేర్లు రెండు మూడు చోట్ల ఉంచేసి, వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్లు ఎత్తివేస్తున్నారు. ఇలా తొట్టంబేడులో భారీగా డబుల్, ట్రిపుల్‌ ఎంట్రీలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

చిత్తూరు, తొట్టంబేడు : మండలంలో 29,345 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లు తొలగిస్తున్నట్లు సమాచారం. అదే వారి పార్టీకి చెందిన కార్యకర్తల ఓట్లు డబుల్‌ ఎంట్రీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

వేర్వేరు చోట్ల ఓట్లు..
టీడీపీ రైతు సంఘం జిల్లా నాయకుడు ప్రభాకర్‌నాయుడుకి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. గుర్తు పట్టకుండా ఉండేందుకు యవ్వన దశలో ఉన్న ఫొటోలను ఓటరు జాబితాకు జతపర్చారు. ఆయన బంధువులు, అనుచరులకు సైతం శ్రీకాళహస్తి పట్టణం, పలు గ్రామాల్లో రెండు, మూడు ఓట్లు ఉన్నట్లు సమాచారం. ఇతను ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు. ఈయన స్వగ్రామం మండలంలోని బోనుపల్లి. ప్రస్తుతం ఈదులగుంటలో నివాసం ఉంటున్నారు. ఓటరు జాబితాను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నాయకులు కైలాసగిరి కాలనీలో రెండు, ఈదులగుంటలో ఒకటి, బోనుపల్లిలో ఒక ఓటు ఉండటం గమనించారు.
అదేవిధంగా బోనుపల్లికి చెందిన టీడీపీ నాయకులు రాజేంద్రనాయుడు, దినేష్‌కుమార్, శ్రీనివాసులు నాయుడు, రామానాయుడు, చంద్రశేఖర్‌ నాయుడు, ప్రమీల, కోలి రామానాయుడు, లలితమ్మ, రామ్మూర్తి, దీపిక, ఆదెమ్మ, విజయ తదితర 30 కుటుంబాలకు చెందిన వ్యక్తులకు బోనుపల్లి, ఈదులగుంట, కైలాసగిరి కాలనీల్లో ఓట్లు ఉన్నాయి.
మండల వ్యాప్తంగా పూడి, పొయ్య, కారాకొల్లు తదితర గ్రామాల్లో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయి.

పట్టించుకోని అధికారులు..
అధికారులు దొంగ ఓట్లను పరిశీలించకుండా అధికార పార్టీ నాయకుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి ఎలక్షన్స్‌లో దొంగఓట్లను చేర్చి టీడీపీ ఎక్కువ మెజారిటీని పొందుతోంది. దొంగ ఓట్లను తొలగించకుండానే ఎలక్షన్స్‌కు ఎలా వెళతారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు ఆధార్‌ లింక్‌ జత చేస్తే దొంగ ఓట్లను ఏరి వేయవచ్చని మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, బోనుపల్లి రవి, సీపీఎం మండల కార్యదర్శి గురవయ్య సోమవారం తహసీల్దారుకు యుగంధర్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో జాబితాను ఇస్తే వాటన్నింటిని తక్షణమే తొలగించే చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top