జిన్నింగ్ మిల్లు గోదాంలో అగ్నిప్రమాదం | fair accident in Jinning mill | Sakshi
Sakshi News home page

జిన్నింగ్ మిల్లు గోదాంలో అగ్నిప్రమాదం

Jan 1 2014 5:24 AM | Updated on Sep 2 2017 2:11 AM

భారీ అగ్నిప్రమాదం నుంచి 120మంది కూలీలు త్రుటిలో తప్పించుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తత వీరి ప్రాణాలను నిలబెట్టింది.

తల్లాడ, న్యూస్‌లైన్: భారీ అగ్నిప్రమాదం నుంచి 120మంది కూలీలు త్రుటిలో తప్పించుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తత వీరి ప్రాణాలను నిలబెట్టింది. తల్లాడ  మండలంలోని అన్నారుగూడెం ఇండస్ట్రియల్ పార్కులో నూతనంగా నిర్మించిన జిన్నింగ్ మిల్లు పత్తి గోదాంలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం కలవరం రేపింది.  2013 నవంబర్ నెలలో ఈ జిన్నింగ్ మిల్లును ప్రారంభించారు. మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించగా... అక్కడే ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లంకి నరసింహారావు కేకలు వేసి హెచ్చరించాడు. దీంతో అక్కడ పని చేస్తున్న 120 మంది కూలీలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. మంటలు గోదాంలో వ్యాపించేలోగానే వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాదంలో రూ.50లక్షల విలువచేసే పత్తి దగ్ధమయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే లోపల ఉన్న ట్రాక్టర్‌ను వెలుపలికి తీసుకువచ్చారు.
 
 ముందస్తు చర్యలు చేపట్టని యాజమాన్యం..
 పత్తి నిల్వ చేసే గోదాంలో ప్రమాదాల నివారణకు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మంటలు ఆర్పివేసేందుకు నీటిని నిల్వ చేయలేదు. షార్ట్ సర్క్యూట్, మంటల కారణంగా ఉన్న ఒక్క బోరుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో మంటలు ఆర్పివేసేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సమీపంలోని బావులు, బోర్ల నుంచి నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పివేసేందుకు యత్నించారు. అలాగే మిల్లు వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ కంట్రోల్ సిస్టమ్ పట్ల సిబ్బందికి అవగాహన కూడా కల్పించలేదు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక సిబ్బంది, కూలీలు పరుగులు తీశారు.
 
 పెద్ద శబ్దం వచ్చింది
 విద్యుత్ షార్ట్ సర్య్కూట్ జరిగిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ప్రమాదం జరిగిందనే విషయం గమనించి కూలీలను బయటకు వెళ్లాలని సూచించాను. దీంతో కూలీలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
 - ఎల్లంకి నరసింహారావు, ట్రాక్టర్ డ్రైవర్
 
 బతికి బయటపడ్డాం
 పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాం. మేం బయటకు వచ్చిన వెంటనే మంటలు వ్యాపించాయి. బతుకుదెరువు కోసం వచ్చిన మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు.
 - తంబళ్ల రాణి,కూలీ
 
 భయంతో వణికి పోయాం
 విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి మంటలు వ్యాపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగు తీశాం. పత్తి రెల్లుతుండగా పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ఎం జరిగిందో తెలియక అయోమయం నెలకొంది.           
            - అరుణ,కూలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement