ఫ్యాక్షన్‌ పోకడలకు జీవం..ధర్మవరం

Faction Trends Are Started In Dharmavaram - Sakshi

సీమ ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ధర్మవరం. రాజకీయం అండతో ఇక్కడ విచ్చు కత్తులు స్వైరవిహారం చేశాయి. పచ్చ చొక్కాల అధికార దాహానికి రక్తపుటేరులు తక్కువ పడ్డాయి. ఎగిసి పడ్డ బాంబులు.. తుపాకుల మోతలు.. తెగిపడ్డ కుత్తుకల హాహాకారాలతో ధర్మవరం నియోజకవర్గంలో నాడు అధర్మమే రాజ్యమేలింది. వెన్నుపోటు రాజకీయాలతో అధికారాన్ని చేజిక్కించుకుని,  ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తొలిదశలో ధర్మవరం నియోజకవర్గంలో అరాచకాలు పెచ్చుమీరాయి. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ పాగా వేసేందుకు ఆర్వోసీ పేరుతో రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెడుతూ వచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మవరంలో శాంతి బీజాలు పడ్డాయి. ఫ్యాక్షన్‌ ప్రభావం పూర్తిగా కనుమరుగైన సమయంలో  అధికారంలోకి వచ్చిన టీడీపీ..  పరిస్థితిని పూర్వపు స్థితికి కంటే మరింత దిగజార్చింది. జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా రాజకీయ చరిత్ర పుటల్లో ధర్మవరం చేరిపోయింది.  

సాక్షి, ధర్మవరం: ధర్మవరం పేరు వినగానే మొదట గుర్తొచ్చేది చేనేత రంగం. శ్రమజీవుల కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో చేనేతకు ఇక్కడి నేత కార్మికులు గుర్తింపు తీసుకువచ్చారు. నియోజకవర్గ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయం, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు.  1955 నుంచి జనరల్‌ కేటగిరి కింద ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరుఫున పప్పూరు రామాచారి గెలుపొందారు. మొత్తం 13 దఫాలు జరిగిన ఎన్నికల్లో గరుడమ్మగారి నాగిరెడ్డి వరుసగా మూడుసార్లు (1983, 1985, 1989) ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఇందులో తొలిసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.  ఆ తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అత్యంత జనాదరణ పొందిన నేతగా నాగిరెడ్డికి పేరుంది.  

ప్రస్తుత రాజకీయ పరిస్థితి 
ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వైఖరితో విసుగు చెందిన సొంత పార్టీలోనే విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది సీనియర్లు ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. చేనేతలను ఆదుకోవడంలో టీడీపీ సర్కార్‌ పూర్తిగా విఫలం కావడంతో ఆ వర్గం టీడీపీపై పూర్తి అసంతృప్తితో ఉంది. ఈ రెండేళ్లలో అధికారపార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి చేరిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఎమ్మెల్యే సూరి ఒంటెద్దు పోకడ నచ్చక చాలా మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉండిపోయారు.  
 

సంక్షేమం దూరం  
చేనేతలకు అందుతున్న అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ పథకం, చేనేత ఆరోగ్య బీమా పథకాలు కార్మికులకు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు టీడీపీ నాయకులకు కమీషన్లు ముట్టజెప్పనిదే ఏ పనీ జరగడం లేదు. సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సూరి తన గుప్పిట్లోకి తీసుకుని కమీషన్ల పైరవీలో జోరుగు నడిపించారు. ఆయన వైఖరి కారణంగా రియల్‌ వ్యాపారం కుదేలైంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వారి భూములను 08 ఖాతాలోకి చేర్పిస్తూ సామాన్యులతో పాటు రియల్టర్లనూ ఇబ్బంది పెట్టారు.  గ్రామాల్లో అర్హత లేకపోయినా.. టీడీపీ అనే ముద్ర ఉంటే చాలు సంక్షేమ పథకాలను కట్టబెడుతూ వచ్చారు.  

శ్రమజీవుల కేంద్రంగా.. 
ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండలం, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3లక్షల జనాభా ఉండగా,  2,23,007 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,11,980, మహిళలు 1,11,001 ఉన్నారు. చేనేతలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం శ్రమ జీవుల కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇంటికో మగ్గం చొప్పున వీధివీధిలో మగ్గం చప్పుళ్లు నిత్యమూ వినిపించేవి. ప్రపంచీకరణ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడంతో నేతన్నలు కుదేలయ్యారు. ముడిసరుకు ధరలు అమాంతం పెరిగి గిట్టుబాటు ధర లభ్యం కాక అప్పుల ఊబిలో చేనేతలు కూరుకుపోయారు. నేతన్నలను ఆదుకునేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వచ్చారు. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల నిరాదరణ కారణంగా చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.  

ప్రధాన సమస్యలివే..  
ఈ ఐదేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా తాగు, సాగునీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని దాదాపు 80 శాతం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 చెరువులు ఉన్నాయి. అయితే ఒక్క ధర్మవరం చెరువుకు తప్ప మిగిలిన చెరువులకు సాగునీరు ఇవ్వలేకపోయారు. ధర్మవరం పట్టణంలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రోజూ 300 నుంచి 500 వరకు ఓపీ నడుస్తూ ఉంటుంది. ధర్మవరం మున్సిపాలిటీతోపాటు, ధర్మవరం మండలం, బత్తలపల్లి ప్రజలు ఇక్కడికి చికిత్సల కోసం వస్తుంటారు.  అత్యవసర వైద్య సేవలకు అనంతపురం తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో మౌలిక వసతులూ కరువయ్యాయి. తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని ముంపు గ్రామాల నిర్వాసితులకు నేటికీ పరిహారం సక్రమంగా అందలేదు. ధర్మవరం పట్టణంలో అత్యధికంగా ఉన్న చేనేతలు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదు.   

శాంతి కుసుమాలు పూయించిన కేతిరెడ్డి 
2009లో వైఎస్సార్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో శాంతి కుసుమాలు పూయించేందుకు కేతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చరిత్ర పుటలు తిరగేస్తే క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అనే పదాలు వినపడుతుంటాయి. అదే తరహాలో కేతిరెడ్డికి ముందు.. కేతిరెడ్డి తర్వాత అంటూ గొప్పగా చెప్పుకునేలా ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. కేతిరెడ్డి హయంలో ధర్మవరం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కింది. చిత్రావతి నది నుంచి ధర్మవరానికి తాగునీటిని అందించారు. నియోజకవర్గంలోని 80 శాతం గ్రామాలకు రోడ్లు వేయించారు. చేనేతల ఇబ్బందులు తీర్చేందుకు ముడిపట్టు రాయితీ పథకాన్ని తీసుకువచ్చారు. ముడిపట్టు ధరలు పెరిగిన నేపధ్యంలో ఎన్‌హెచ్‌డీసీ స్కీంను తీసుకువచ్చి వారికి ఆసరాగా నిలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ అటకెక్కించేశారు.    
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top