చెప్పినట్లు వినకపోతే నీ అంతుచూస్తా !

EX MLA Yarapatineni Warning To Mirchi Yard Owner In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పినట్లు వినకపోతే హతమార్చుస్తానని బెదిరించి తన ఇల్లును బలవంతంగా ఓ కోల్డ్‌స్టోరేజ్‌ యజమాని కుమారుడి పేరుతో రాయించి అన్యాయం చేశాడంటూ పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన అనబోతుల గురవారెడ్డి బుధవారం రూరల్‌ స్పందన కేంద్రంలో రూరల్‌ అదనపు ఎస్పీ కె. చక్రవర్తికి  ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మా ప్రాంతంలోని గ్రామాల్లో మిరపకాయల కొనుగోళ్లు, చేస్తుంటాను. 2016లో మిరపకాయల ధర తక్కువగా ఉండటంతో రైతుల పేర్లతోనే మా ప్రాంతాంలోని బాలాజీ కోల్డ్‌ స్టోరేజ్‌లో నాలుగు వేల బస్తాల మిరపకాయలు దాచాను.

కోల్ట్‌స్టోరేజ్‌ హామీతో బ్యాంకు నుంచి రూ.కోటి 10 లక్షలు అప్పుగా తీసుకున్నాను. మిర్చి రేటు  తగ్గుదల అవుతున్న క్రమంలో కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని భవనాసి ఆంజనేయులు, మేనేజరు కొత్తా పాండు రంగారావు నన్ను పిలిచి మిర్చి మొత్తం తమకు అప్పగిస్తే బ్యాంకు రుణం తీర్చుతామని నమ్మించి అగ్రిమెంటు రాయించుకున్నారు. ఆపై బ్యాంకు రుణం తీర్చకుండా బ్యాంకు మేనేజర్‌తో కుమ్మకై నాకు, రైతులకు రుణం తీర్చాలంటూ నోటీసులు జారీ చేశారు. బ్యాంకు మేనేజరు మా ఇళ్లకు వచ్చి రుణం తీర్చకపోతే మీ ఇళ్లు, పొలాలు వేలం వేస్తామని భయపెట్టారు. మిర్చి తీసుకున్న వారిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు.

ఇంతలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నన్ను పిలిపించి రూ.70 లక్షల విలువచేసే ఇంటిని శ్రీరామ్‌ వెంకట శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్‌ చేయాలనీ, లేకుంటే హతమారుస్తామని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో రిజస్టర్‌ చేశాను. అనంతరం 2017లో బ్యాంకు వారితో వన్‌టైమ్‌ సెటిల్‌ మెంట్‌ చేయడంతో రూ.40 లక్షలు నాకు రావాల్సి ఉంది. ఇల్లు తీసుకున్నారు కదా కనీసం ఆ డబ్బు అయినా ఇవ్వాలని అడిగితే దుర్భాషలాడి మళ్లీ ఈ విషయం గురించి మాట్లాడితే చంపేస్తామని అక్కడ నుంచి గెంటేశారని వివరించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా నీ అంతు చూస్తామని హెచ్చరిండంతో ఇప్పటి వరకు మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top