భారీగా పెరుగుతున్న అమ్మకాలు | every year increasing alcohol sales | Sakshi
Sakshi News home page

భారీగా పెరుగుతున్న అమ్మకాలు

Jul 13 2014 2:33 AM | Updated on Aug 30 2018 3:58 PM

వర్షం వచ్చినా.. రాకపోయినా.. పంటలు పడినా.. పండకపోయినా.. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నా..

కర్నూలు: వర్షం వచ్చినా.. రాకపోయినా.. పంటలు పడినా.. పండకపోయినా.. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నా.. కూరగాయలు, ఆకుకూరల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినా.. వీటితో ఏ మాత్రం సంబంధం లేకుండా మందుబాబులు మత్తులో జోగుతున్నారు. కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. మద్యం కొత్త విధానం ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పది రోజుల్లోనే రూ. 31 కోట్ల మద్యం తాగేశారు. 2011-12 సంవత్సరంలో రూ. 503 కోట్లు, 2012-13లో రూ.620 కోట్లు, 2013-14లో రూ.660 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

 మద్యం.. ప్రభుత్వాలను నడిపిస్తున్న ఇం‘ధనం’. సర్కార్ ప్రతి యేటా మద్యం విక్రయాలను పెంచుతోంది. ప్రజలను మత్తులో ముంచేస్తోంది. కాసుల వర్షం కురుస్తుందని పాలకులు సంబరపడుతున్నారే గాని.. ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని ఆలోచించడం లేదు. మద్యం మత్తులో కాపురాలు కూలిపోతున్నాయి. పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి.

లక్షల రూపాయలు పెట్టి లెసైన్స్ దక్కించుకున్న వ్యాపారులు మారుమూల గ్రామాల్లో కూడా మద్యం అమ్మకాలను విస్తరిస్తున్నారు. మంచినీళ్లలాగా మద్యం అందుబాటులో ఉండడంతో మందుబాబుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యానికి బానిసలైన వారు సమాజ ంలో మృగాలుగా మారుతున్నారు. కుటుంబ బంధాలను సమాధి చేస్తున్నారు. పెళ్లాం బిడ్డలను హింసిస్తున్నారు. చంపడానికి కూడా వెనుకాడడంలేదు. తాగుడుకు బానిసలైన భర్తల వేధింపులను భరించలేక మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలు అనాధలుగా మారుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య కూడా ఏడాదికేడాది  పెరుగుతోంది.

 ఏటేటా పెరుగుతున్న మద్యం విక్రయాలు..
 కరువు ప్రాంతంగా గుర్తింపు ఉన్న కర్నూలు జిల్లాలో మద్యం విక్రయాల్లో మాత్రం కరువు ఛాయలు ఎక్కడా కనిపించడంలేదు. జిల్లాలో 194 మద్యం దుకాణాలు, 35 బార్లు ఉన్నాయి. ఏటేటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా మద్యం అమ్మకాలను పోల్చి చూస్తే మూడు రెట్లు అమ్మకాలు పెరిగాయి. జిల్లాలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ద్వారా అయితేనేం, మద్యం షాపుల ద్వారా అయితేనేం మద్యం పుష్కలంగా దొరుకుతుంది. నెలకు 2.40 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోతోంది. వాటి ద్వారా నెలకు రూ.60 కోట్లు ప్రభుత్వానికి రాబడి వస్తోంది.

 ప్రభుత్వ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా..
 ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు సాగిస్తున్న వికృత క్రీడలో సామాన్యుడు బలైపోతున్నాడు. గుక్కెడు నీరు లేక గొంతెండుతున్న పల్లెల్లోనూ సీసాల కొద్దీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 18 ఏళ్ల యువకులు సైతం మద్యానికి అలవాటుపడుతున్నారు. ఇది తప్పు అని తేల్చుకోలేక సతమతమవుతున్నారు. పగలంతా కష్టం చేసి సంపాదించిన డబ్బును సాయంత్రానికి మద్యానికి తగలేస్తున్నారు. మద్యం సేవించడం వల్ల సంభవించే దుష్ఫలితాలు తెలిసినప్పటికీ మద్యాన్ని సేవించే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. నేటి యువతరం మద్యం సేవించడం ప్యాషన్‌గా చేసుకుంటున్నారు. మరికొంత మంది మానసిక ఒత్తిడికి తట్టుకోలేక మద్యానికి బానిసలవుతున్నారు.

 రోగాలే.. రోగాలు..
 మద్యం మనిషిని ఆర్థికంగా దెబ్బతీయడమే కాక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. మందుబాబులకు కాలేయం, గుండె, మెదడు, పాంక్రియాస్, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోగాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మద్యం మానేస్తే తప్ప వ్యాధులు తగ్గవని వైద్యులు హెచ్చరిస్తున్నా అలవాటును మానుకోలేకపోతున్నారు. రోగాల తీవ్రత ఎక్కువై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

 కార్యాచరణ ఏదీ?
 ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఏర్పాటు చేసిన మద్య విమోచన కమిటీ నామమాత్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మద్యపానం వల్ల కలిగే దుష్పలితాలను వివరించడానికి కార్యాచరణ ఇప్పటిదాకా లేకపోవడమే ప్రధాన లోపం. ఇప్పటికైనా కమిటీ ముందుగా చైతన్యవంతమై.. ఆతర్వాత మందుబాబులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement