సీఎం జగన్‌కు వినతుల వెల్లువ  | Employees who have been given request letter of their problems | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు వినతుల వెల్లువ 

Jun 30 2019 4:25 AM | Updated on Jun 30 2019 4:25 AM

Employees who have been given request letter of their problems - Sakshi

విశాఖ విమానాశ్రయంలో తనను చూడటానికి వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా కరచాలనం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం:  నౌకాదళ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి వెళ్లేందుకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ విమానాశ్రయం ఆవరణలో బ్యానర్లు పట్టుకొని వేచి ఉన్నవారిని చూసి కాన్వాయ్‌ని ఆపి, ఒక్కొక్కరిగా తన వద్దకు పిలిపించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ సర్వేయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖలో 233 మంది కమ్యూనిటీ సర్వేయర్లకు వేతనాలు ఇవ్వడం లేదని సీఎం జగన్‌కు వారు విన్నవించుకున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగన్‌ హామీ ఇవ్వడంతో సర్వేయర్లు హర్షం వ్యక్తం చేశారు. ఏపీడీడబ్ల్యూఎస్‌సీ జలధార ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో పని చేస్తున్న తమను విధుల నుంచి తొలగించారని సైట్‌ ఇంజనీర్లు సీఎం జగన్‌కు తమ గోడు వినిపించారు. తమకు న్యాయం చేయాలంటూ 50 మంది సైట్‌ ఇంజనీర్లు వినతి పత్రం అందించారు. ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు కాంతారావు ముఖ్యమంత్రి జగన్‌కు వినతి పత్రం అందించారు. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే నిర్ణయం వెలువరిస్తానని చెప్పారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాల కన్సాలిడేటెడ్‌ పే ఉద్యోగులతో మాట్లాడారు. తర్వాత విజయనగరానికి చెందిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు జగన్‌కు వినతిపత్రం అందించారు.  

తిరుగు ప్రయాణంలోనూ వినతుల స్వీకరణ 
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రజలను కలిసేందుకు సమయం లేకపోవడం వల్ల కలవలేకపోయానని, తిరిగి వచ్చేటప్పుడు కలుస్తానని.. అందర్నీ ఉండమని చెప్పాలని కలెక్టర్‌ ద్వారా తహసీల్దార్‌కు జగన్‌ సమాచారమందించారు. తిరుగు ప్రయాణంలోనూ అక్కడ వేచి ఉన్న వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులను జగన్‌ స్వీకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement